ఆత్మహత్యాయత్నం చేసిన రైతు శ్రీనివాసులు
అనంతపురం , ఉరవకొండ రూరల్: ఎటువంటి సమాచారం తెలపకుండా, నోటీసు ఇవ్వకుండా, పరిహారం చెల్లించకుండా అధికారులు తన పొలంలోంచి హంద్రీనీవా పిల్లకాలువ తవ్వకం పనులు చేస్తుండటంతో మనస్తాపం చెందిన రైతు మాసినేని శ్రీనివాసులు (55) ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. చిన్నముస్టూరుకు చెందిన మాసినేని శ్రీనివాసులుకు గ్రామ సమీపంలో హంద్రీ–నీవా కాలువకు ఆనుకుని ఉన్న సర్వేనంబర్ 38లో 3.20 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది.
కోనాపురం చెరువుకు నీరు నింపేందుకు అధికారులు శుక్రవారం చిన్నముస్టూరు ప్రాంతంలోని హంద్రీనీవా కాలువ వద్ద నుంచి పిల్లకాలువ పనులు చేయడానికి మార్కింగ్ వేసి జేసీబీలతో పనులు ప్రారంభించారు. తనకు ముందస్తు నోటీసులు గానీ, సమాచారం ఇవ్వకుండా దౌర్జన్యంగా పనులు ఎలా చేస్తారంటూ అధికారులను రైతు శ్రీనివాసులు నిలదీశాడు. తమను అడ్డుకునే హక్కు లేదని, కోర్టు ఉత్తర్వుల మేరకు పనులు చేపడుతున్నామని అధికారులు స్పష్టం చేయడంతో దిక్కుతోచని రైతు పొలంలోనే పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుమారుడు నరేష్ గమనించి హుటాహుటిన ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ప్రథమ చికిత్స చేసిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆస్పత్రికి పంపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment