
హత్యకు గురైన రమణ
మల్కాపురం (విశాఖ పశ్చిమ): కన్న తండ్రిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకే కాలయముడయ్యాడు. పెంచి పోషించాడన్న కనికరం కూడా లేకుండా మద్యం మత్తులో నిర్దాక్షిణ్యంగా కడతేర్చాడు. తండ్రీ కొడుకుల బంధానికే మచ్చగా నిలిచే ఈ దుర్ఘటన జీవీఎంసీ 49వ వార్డులో ఆదివారం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జీవీఎంసీ 49వ వార్డు త్రినాథపురం సామాజిక భవనం సమీపాన నీలాపు రమణ(48) అనే వ్యక్తి భార్య పద్మ, కుమారుడు మోహన్‌తో కలిసి నివాసముంటున్నాడు.
బతుకుతెరువు నిమిత్తం పద్మ విదేశాలలో పనులకు ఇటీవలే వెళ్లగా తండ్రీ కొడుకు స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే భార్య పద్మ ఎవరితోనే వెళ్లిపోయిందని, విదేశాలలో ఇతరులతో సహజీవనం చేస్తోందని అనుమానిస్తూ ఈ విషయంపై రమణ కొడుకుతో గొడవపడేవాడు.
శనివారం రాత్రి కూడా వారి మధ్య వాదన జరిగింది. ఆదివారం కూడా నీ తల్లి తప్పుడు మనిషి.. అందుకే దూరంగా వెళ్లిపోయిందని కొడుకుతో వాదించడంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న మోహన్ ఆవేశంతో తండ్రి మెడపై కాళ్లతో తొక్కి కత్తితో పొడిచేశాడు. దీంతో రమణ అక్కడికక్కడే మరణించాడు.
తండ్రి మృతదేహాన్ని గదిలో ఉంచి వివాహితురాలైన అక్కకు ఫోన్‌లో సమాచారం అందించాడు. తండ్రి మృతిచెందాడని చూడడానికి రావాలని తెలిపాడు. దీంతో ఆమె అక్కడకు రాగా రక్తపు మడుగులో ఉన్న తండ్రిని చూసి అనుమానం వచ్చి మల్కాపురం పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. నిందితుడు మోహన్ పరారీలో ఉన్నాడని సీఐ కేశవరావు తెలిపారు.