నక్సల్స్‌ పేరిట మాజీ సర్పంచ్‌పై కాల్పులు | Firing on the former sarpach in the name of Naxals | Sakshi
Sakshi News home page

నక్సల్స్‌ పేరిట మాజీ సర్పంచ్‌పై కాల్పులు

Published Sun, Oct 22 2017 1:20 AM | Last Updated on Tue, Oct 2 2018 2:30 PM

Firing on the former sarpach in the name of Naxals - Sakshi

ఇబ్రహీంపట్నం: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్‌లో శుక్రవారం అర్ధరాత్రి నక్సల్స్‌ పేరిట మాజీ సర్పంచ్‌ సుంకె రాజన్న(55)పై కొందరు కాల్పులు జరిపారు. శుక్రవారం రాత్రి 11.15 గంటలకు నక్సల్స్‌ పేరుతో మాజీ సర్పంచ్‌ సుంకె రాజన్న ఇంటికి ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చారు. ఒకరు ఇంటి బయట కాపలా ఉండగా.. మిగిలిన ఇద్దరు ఇంటి లోపలికి ప్రవేశించారు. ‘మేం నక్సలైట్లం.. గ్రామంలో రాజన్న అందరిని బెదిరిస్తూ సంచలనం సృష్టిస్తున్నాడు.. ఏడి వాడు’ అంటూ తీవ్ర స్వరంతో కుటుంబీకులను మందలించారు. ఆ తర్వాత రాజన్న నిద్రిస్తున్న గదిలోకి వెళ్లి షార్ట్‌ వెపన్‌తో ఓ రౌండ్‌ కాల్చి పారిపోయారు. మెట్‌పల్లి పోలీసులు వచ్చి రాజన్నను కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.
  
భూవివాదమే కారణమా? 
గ్రామానికి చెందిన చెదలు రాజేందర్, ఆయన తండ్రి చెదలు భూమన్నతో గ్రామ శివారులోని 3.03 ఎకరాల భూమిపై రాజన్నకు 15 ఏళ్ల నుంచి భూవివాదం ఉంది. సుంకె రాజన్న ఆ భూమి కోసం హైకోర్టును ఆశ్రయించగా.. ఏడాది క్రితం భూమి రాజన్నకే చెందుతుందని తీర్పు వచ్చింది. చికిత్స పొందుతున్న రాజన్న తనపై చెదలు రాజేందర్, భూమన్నలే దాడి చేయించారని ఆరోపించాడు. వారి నుంచి తనకు ప్రాణ హాని ఉందని గతంలో రాజన్న పలుమార్లు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రాజన్న కుమారుడు దివాకర్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామ్‌నాయక్‌ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement