హైదరాబాద్: కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరామ్ హత్యలో మరికొందరి పాత్ర కూడా ఉందా? ఘటన జరిగిన సమయంలో ఐదుగురు వ్యక్తులు అక్కడే ఉన్నారా? వారంతా కలిసే జయరామ్‌ను అంతమొందించారా? ఇవీ ఈ కేసులో తాజాగా తలెత్తిన అనుమానాలు. ఈ విషయాల్ని నిర్ధారించుకోవడానికి, అసలు ఆ రోజు ఏం జరిగిందనే అంశాలు తెలుసుకోవడానికి హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసుకు సంబంధించి గురువారం రాత్రి 93/2019 నెంబర్‌తో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతానికి నందిగామ పోలీసులు నమోదు చేసిన తొమ్మిది సెక్షన్లను కొనసాగిస్తామని, భవిష్యత్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా మరికొన్ని చేరుస్తామని తెలిపారు. జయరామ్ గతనెల 31న జూబ్లీహిల్స్ రోడ్ నం.10లోని రాకేష్ నివాసంలో హత్యకు గురికాగా, ఆయన మృతదేహం కృష్ణా జిల్లా నందిగామ లో మరుసటిరోజు కనిపించింది. దీంతో కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించిన నందిగామ పోలీసులు రాకేష్‌తోపాటు వాచ్‌మెన్ శ్రీనివాస్‌రెడ్డిని అరెస్టు చేశారు. పెనుగులాట, పిడిగుద్దుల వల్లే జయరామ్ మృతిచెందినట్టు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో జయరామ్ భార్య పద్మశ్రీ విజ్ఞప్తి మేరకు ఈ కేసు తెలంగాణ పోలీసులకు బదిలీ అయింది. అనంతరం దర్యాప్తు ప్రారంభించిన జూబ్లీహిల్స్ పోలీసులు.. ఈ హత్యలో ఐదుగురు పాల్గొని ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ విషయం నిర్ధారించుకోవడానికి ప్రస్తుతం ఏపీలో ఉన్న నిందితుల్ని పీటీ వారెంట్‌పై తీసుకొచ్చి విచారించాలని నిర్ణయించారు. శుక్రవారం నాంపల్లి న్యాయస్థానం నుంచి పీటీ వారెంట్ కూడా తీసుకున్నారు. ఒకటి లేదా రెండు రోజుల్లో ఓ ప్రత్యేక బృందం ఏపీ వెళ్లి అక్కడి కోర్టు అనుమతితో జైల్లో ఉన్న నిందితులను ఇక్కడకు తీసుకురానుంది.
పద్మశ్రీ వాంగ్మూలం నమోదు..
జయరామ్ హత్య కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం ఆయన భార్య పద్మశ్రీ నుంచి పోలీసులు వాంగ్మూలం నమోదు చేశారు. బంజారాహిల్స్ ఏసీపీ కె.శ్రీనివాసరావు నేతృత్వంలోని దర్యాప్తు అధికారులు జూబ్లీహిల్స్ రోడ్ నెం.44లో ఉన్న జయరామ్ నివాసానికి వెళ్లి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆమె ఏపీ పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడినట్టు సమాచారం. ఈ కేసులో శిఖాచౌదరి ప్రమేయం ఉన్నట్లు బలమైన అనుమానాలు ఉన్నాయని పునరుద్ఘాటించారు. తన భర్త హత్య జరిగిన రోజు రాత్రి శిఖా చౌదరి తన ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి బీరువాలో ఉన్న కీలక డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లినట్టు పద్మశ్రీ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఆమెను విచారిస్తేనే ఈ హత్యకు గల కారణాలు పూర్తిగా వెలుగులోకి వస్తాయని చెప్పినట్టు తెలిసింది. ఈ విషయంలో ఏపీ పోలీసులు చెబుతున్న అంశాలు నమ్మశక్యంగా లేవని తన వాంగ్మూలంలో స్పష్టంచేసినట్టు సమాచారం. దర్యాప్తు అధికారులు దాదాపు రెండు గంటల పాటు పద్మశ్రీతో మాట్లాడి అన్ని వివరాలూ నమోదు చేసుకున్నారు. జయరామ్ అమెరికా నుంచి ఎప్పుడు వచ్చారు..? చివరగా ఆమెతో ఎప్పుడు మాట్లాడారు..? హత్య జరిగిన తర్వాత ఈ విషయంలో ఆమెకు ఎప్పుడు, ఎవరి ద్వారా తెలిసింది? శిఖా చౌదరి వ్యవహారశైలి ఏమిటి వంటి వివరాలు సేకరించారు.
శిఖాచౌదరిని విచారిస్తాం
జయరామ్ హత్య కేసుకు సంబంధించిన అన్ని వివరాలనూ పరిశీలించామని వెస్ట్‌జోన్ డీసీపీ ఎ.ఆర్.శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీ పోలీసుల దర్యాప్తు అంశాలతోపాటు జయరామ్ భార్య పద్మశ్రీ పిటిషన్‌లో ఉన్న అంశాలను పరిగణనలోకి తీసుకొని విచారణ సాగిస్తామని వెల్లడించారు. ఏపీ పోలీసులు అరెస్టు చేసిన నిందితులిద్దరినీ కస్టడీకి తీసుకుని విచారిస్తామని పేర్కొన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్నవారెవ్వరూ తప్పించుకోలేరని స్పష్టంచేశారు. శిఖాచౌదరిని కూడా విచారిస్తామని చెప్పారు.
జయరామ్ హత్యలో ఐదుగురు?
Published Sat, Feb 9 2019 1:22 AM | Last Updated on Sat, Feb 9 2019 11:10 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment