ఫైల్ ఫోటో
సాక్షి, బెంగళూరు : కోట్ల రూపాయల బ్యాంకు కుంభకోణం కేసులో నిందితుడు, గురు రాఘవేంద్ర బ్యాంక్ మాజీ సీఈఓ వాసుదేవ్ మైయా (70) అనుమానాస్పద మరణం కలకలం రేపుతోంది. సోమవారం సాయంత్రం నగరంలోని తన ఇంటి వెలుపల పార్క్ చేసిన కారులో చనిపోయి కనిపించారు. దీనిపై కేసు నమోదు చేసిన సుబ్రమణ్యపుర పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్య చేసుకున్నారనే అనుమానాలు వ్యక్తమవు తున్నప్పటికీ, కారణాలను పోలీసులు ఇంకా నిర్ధారించలేదు.
2012-2018వరకు పదవీలో కొనసాగిన వాసుదేవ్ పైభారీ అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఆర్‌బీఐ దర్యాప్తులో1400 కోట్ల రూపాయల అవకతవకలు వెలుగు చూశాయి. ఈ క్రమంలో అతనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ తదితర విభాగాలు మోసం, ఫోర్జరీ కేసు నమోదు చేసాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా జూన్ 18 న అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) శ్రీ గురు రాఘవేంద్ర కోఆపరేటివ్ బ్యాంక్ కు చెందిన ఐదు కార్యాలయాలు, బ్యాంక్ చైర్మన్ కె రామకృష్ణ నివాసాల వద్ద కూడా శోధనలు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో దర్యాప్తునకు భయపడిన వాసుదేవ్ మైయా విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.
కాగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా 1400 కోట్ల రూపాయల ఆర్థిక అవకతవకలపై ఈ ఏడాది జనవరిలో దర్యాప్తు ప్రారంభించింది. అలాగే ఆర్‌బీఐ ఆరు నెలలపాటు ఆంక్షలు విధించింది. డిపాజిటర్ ఉపసంహరణ మొత్తాన్ని35 వేల రూపాయలకు పరిమితం చేసింది. ఆ తరువాత గత నెలలో ఈ పరిమితిని ఒక లక్ష రూపాయలకు పెంచింది. ఈ సందర్భంగా కరోనా వైరస్ ఆంక్షలు ఉన్నప్పటికీ, చాలా మంది సీనియర్ సిటిజన్లు తమ డబ్బులను ఉపసంహరించుకునేందుకు బ్యాంకు ముందు క్యూలు కట్టారు.
Comments
Please login to add a commentAdd a comment