గిరీష్‌సింగ్ (ఫైల్)
నాగోలు: భక్తి ముసుగులో మల్టీలెవల్ మార్కెటింగ్ వ్యాపారం చేస్తూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి 4 కార్లు, 3 బైక్‌లు, 5 పాస్‌పోర్టులు, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఎల్‌బీనగర్ సీపీ క్యాంపు కార్యాలయంలో రాచకొండ జాయింట్ సీపీ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు... నెల్లూరుకు చెందిన ఎగరపతి కుమార్ గిరీష్‌సింగ్ వృత్తి రీత్యా లైఫ్ కోచ్ వ్యాపారం చేసేవాడు. నగరానికి వలస వచ్చిన ఇతను మదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో తమ్ముడు దిలీప్‌సింగ్‌తో కలిసి ఉంటున్నాడు. పలు చానెళ్లలో భక్తి ఉపన్యాసాలు ఇచ్చే అతను ‘అద్వైత స్పిరిటల్ రీచార్జ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ అద్వైత క్రియ’, డ్రీమ్ బ్రిడ్జ్ పేరుతో సోషల్ బిజినెస్ నెట్‌వర్క్ ప్రారంభించాడు.
వివిధ చానెళ్లలో కుబేర ప్రక్రియ, అమృత ప్రక్రియ, ధనవంత ప్రక్రియ పేరుతో ప్రచారం చేస్తూ స్వామీజీగా అవతారమెత్తాడు. పూజలు, ప్రార్థనలు చేస్తామని చెప్పి పలువురితో పరిచయం పెంచుకున్న అతను. తన వద్ద పెట్టుబడి పెడితే డబుల్ చేస్తానని నమ్మించేవాడు. డ్రీమ్ బ్రిడ్జ్ నాగోల్‌కు చెందిన స్వప్న ఇదే విధంగా నమ్మించి రూ.21.78 లక్షలు తీసుకున్నారు. మరికొందరిని చేర్పిస్తే పెట్టుబడి 10 రెట్లు అవుతుందని చెప్పారు. ఇదే తరహాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలువురిని నమ్మించి రూ.50 నుంచి 60 కోట్లు వసూలు చేశారు. వసూలు చేసిన మొత్తాన్ని తన సోదరుడు దిలీప్‌తో కలసి 16 బ్యాంక్‌లలో డిపాజిట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు నిందితుడు గిరీష్‌సింగ్‌ను అరెస్ట్ చేసి అతడి నుంచి కార్లు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పోలీస్ కస్టడీలోకి తీసుకుని పూర్తి విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని జాయింట్ సీపీ తెలిపారు. సమావేశంలో సైబర్‌క్రైమ్ డీసీపీ నాగారాజు, ఏసీపీ హరినాథ్, సీఐ నరేందర్‌గౌడ్, లక్ష్మీకాంత్‌రెడ్డి, విజయ్‌కుమార్, ఎ.వి.రంగ తదితరులు పాల్గొన్నారు.
మంది సొమ్ముతో జల్సాలు...
స్పిరిటల్ రీచార్జ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ పేరుతో మోసాలకు పాల్పడిన గిరిష్‌సింగ్ పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసి లగ్జరీ కార్లను కొనుగోలు చేశాడు. సాఫ్ట్‌వేర్, వెబ్‌ఆప్స్ కంపెనీలను ఏర్పాటు చేశాడు. వివిధ పేర్లతో 250 కార్యాలయాలను ప్రారంభించాడు. రూ. 3 కోట్ల వెచ్చించి రామోజీ ఫిలిం సిటీలో ఘనంగా వివాహం చేసుకున్నాడు. విదేశీ పర్యటనల పేరుతో 20 దేశాలు చుట్టి వచ్చాడు.
జీతాలు ఇవ్వకుండా వేధింపులు
గిరీష్‌సింగ్ ప్రారంభించిన 250 కంపెనీల్లో ప్రస్తుతం 50 కంపెనీలు నడుస్తున్నాయని ఇందులో పనిచేసే దాదాపు 350 మందికి కొంతకాలంగా జీతాలు ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment