
చందానగర్ : తాగిన మైకంలో స్నేహితుడిని కత్తితో గొంతు కోసి హత్య చేసిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ తిరుపతిరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి...చందానగర్‌లోని హుడా కాలనీకి చెందిన అజయ్ దీప్‌రాజ్ (20) ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. శేర్‌లింగంపల్లి గోపీనగర్‌కు చెందిన సంపత్ అతడికి చిన్ననాటి స్నేహితుడు. ఆదివారం మధ్యాహ్నం బైక్‌పై వచ్చిన సంపత్ అజయ్ దీప్‌రాజ్‌ను బయటికి తీసుకెళ్లాడు.
రాత్రి తొమ్మిది గంటల సమంలో మద్యం తాగిన వీరు హుడా ట్రేడ్ సెంటర్ వద్ద ఘర్షణ పడ్డారు. నాలుగేళ్ల క్రితం జరిగిన గొడవను మనస్సులో పెట్టుకున్న సంపత్ అజయ్‌పై దాడి చేసి కత్తితో గొంతుకోశాడు. తీవ్రంగా గాయపడిన అజయ్‌ను అతని సోదరుడు పృధ్వీ మదీనాగూడలోని అర్చన ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి నీరేడు డానియెల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు సంపత్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.