పిల్లలను బంధించి తల్లిపై లైంగిక దాడి.. | Gang Rape on Married Women in Hyderabad | Sakshi
Sakshi News home page

తెగబడ్డ మృగాళ్లు

Published Mon, Mar 11 2019 7:12 AM | Last Updated on Mon, Mar 11 2019 7:12 AM

Gang Rape on Married Women in Hyderabad - Sakshi

ఘటనా స్థలంలో వివరాలు సేకరిస్తున్న రాచకొండ పోలీసులు

జీవనోపాధి కోసం భర్త ఆటో నడిపేందుకు వెళ్లగా నలుగురు పిల్లలతో ఒంటరిగా ఉన్న మహిళపై కామాంధులు తెగబడ్డారు.పిల్లలను గదిలో బంధించి లైంగిక దాడి చేశారు. ఈ దుర్ఘటన శనివారం రాత్రిపహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

చాంద్రాయణగుట్ట: జీవనోపాధి కోసం భర్త ఆటో నడిపేందుకు వెళ్లగా ఆమె పిల్లలతో కలిసి ఇంట్లో ఉంటోంది. ఒంటరిగా ఉన్న ఆమెపై కామాంధులు తెగబడ్డారు. నలుగురు పిల్లలను ఒక గదిలో బంధించి దారుణంగా లైంగిక దాడి చేశారు. ఒకరు బెదిరిస్తూ ఉండగా మరో ఇద్దరు సమాజం తలదించుకునేలా అత్యాచారం చేశారు.  బంధువులే రాబందులుగా మారి కొనసాగించిన ఈ దుస్యాసన పర్వం నగర శివారులోని పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి  జరిగింది.  పోలీసులు తెలిపిన మేరకు.. జల్‌పల్లి వాదే ముస్తఫా బస్తీకి హర్యానా నుంచి షాకీర్‌ ఖాన్‌ కుటుంబం ఇటీవలే వలస వచ్చి నివాసం ఉంటుంది. షాఖీర్‌ఖాన్‌  ఆటోడ్రైవర్‌గా పని చేస్తుండగా....అతని భార్య (25) నలుగురు పిల్లలతో కలిసి ఇంటి వద్దే ఉంటుంది.

వీరికి దగ్గరలోనే సమీప బంధువులు కూడా నివాసం ఉంటున్నారు. శనివారం ఉదయం భర్త ఆటోకు వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉందని గుర్తించిన బంధువులు ఆజాద్, అంజాద్‌లతో పాటు వారి స్నేహితుడు రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి వచ్చి మంచినీరు అడిగారు. తెలిసిన వారే కావడంతో ఆమె ఇంట్లోకి వెళ్లి నీరు తెచ్చేంతలోపే బంధించారు. నలుగురు పిల్లలను మూడో వ్యక్తి పక్క గదిలో ఉంచి ఎవరికైనా చెపితే చంపేస్తామంటూ బెదిరించి కాపలగా ఉన్నాడు. మిగిలిన ఇద్దరు వ్యక్తులు ఆమెపై ఒకరి తర్వాత మరొకరు లైంగిక దాడికి పాల్పడ్డారు. విధులు ముగించుకొని అర్ధరాత్రి వచ్చిన భర్తకు ఆమె జరిగిన ఘోరాన్ని వెల్లడించింది. దీంతో అతడు ఆదివారం పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేశాడు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం కొండాపూర్‌లోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. 

మా పరిధి కాదంటున్న పోలీసులు..
కాగా గృహిణిపై లైంగిక దాడికి జరిగిన ఇల్లు హైదరాబాద్, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల సరిహద్దుగా ఉండడంతో ఇరు కమిషనరేట్ల అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇటు హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని దక్షిణ మండలం డీసీపీ అంబర్‌ కిషోర్‌ ఝా, ఫలక్‌నుమా ఏసీపీ డాక్టర్‌ ఎం.ఎ.రషీద్, చాంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్‌ జి.కోటేశ్వర్‌ రావులు రాగా...అటు రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని వనస్థలిపురం ఇన్‌ఛార్జి ఏసీపీ యాదగిరి రెడ్డి, పహాడీషరీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.శంకర్‌లు ఘటనా స్థలానికి చేరుకొని మా పరిధి కాదంటే...మా పరిధి కాదంటూ సతమతమయ్యారు. చివరకు పహాడీషరీఫ్‌ పోలీసులే కేసు నమోదు చేశారు. దీనిపై రెవెన్యూ అధికారుల సూచనకనుగుణంగా అవసరమైతే తామే కేసును బదిలీకి తీసుకుంటామని ఫలక్‌నుమా ఏసీపీ డాక్టర్‌ ఎం.ఎ.రషీద్‌ సాక్షికి తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement