అక్రమ నిర్మాణాలపై బల్దియా కొరడా | GHMC Action on illegal construction Hyderabad | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ చెక్‌

Published Tue, Oct 15 2019 12:01 PM | Last Updated on Tue, Oct 15 2019 12:01 PM

GHMC Action on illegal construction Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు జీహెచ్‌ఎంసీ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఉండడం లేదు. యథేచ్ఛగా అక్రమ, అదనపు అంతస్తుల నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిని అడ్డుకునేందుకు అధికారులు మూడుసార్లు నోటీసులు జారీ చేయాల్సి ఉండడంతో కూల్చివేతల్లో జాప్యం జరుగుతోంది. అంతేకాకుండా తమకు సకాలంలో నోటీసులు అందలేదంటూ కొందరు.. అసలు నోటీసులే రాలేదంటూ మరికొందరు కోర్టును ఆశ్రయిస్తున్నారు. మరోవైపు అధికారులు అక్రమార్కులకు సహకరిస్తూ నోటీసుల జారీలో జాప్యం చేస్తున్నారు. ఈ మేరకు సమయం లభిస్తుండడంతో అక్రమార్కులు కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటున్నారు. వీటన్నింటికీ చెక్‌ పెడుతూ, కోర్టు వివాదాలకు తావు లేకుండా ఇక నుంచి ఆన్‌లైన్‌లో కూల్చివేతల నోటీసులు జారీ చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఒకవేళ అనుమతి పొందినప్పటికీ డీవియేషన్లతో, అదనపు అంతస్తులతో అక్రమాలకు పాల్పడే వారికి ఈ విధానంలో ప్రస్తుతమున్న డీపీఎంఎస్‌ సిస్టమ్‌ ద్వారా నోటీసు జారీ అవుతుంది. ఆన్‌లైన్‌ ద్వారా నోటీసులిస్తే ఏ రోజున అది జారీ అయిందనే విషయం తెలుస్తుంది. తద్వారా కోర్టుల్లో వివాదాలకు తావుండదు. నోటీసుల విషయంలో అక్రమార్కులు అబద్ధాలు ఆడేందుకు వీలుండదు. అంతేకాకుండా అక్రమ నిర్మాణానికి సంబంధించి ఎంతమేర అక్రమాలు జరిగాయి? ఎలా జరుగుతున్నాయి? అనే అంశాలపై ఫొటోలతో సహా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు వీలుంది. ఇలా చేస్తే అక్రమ నిర్మాణాలను ఎప్పటికప్పుడు నిలువరించవచ్చని అధికారులు భావిస్తున్నారు. 

అధికారులపైనా చర్యలు...
జీహెచ్‌ఎంసీలో ప్రతిఏటా ఎన్నో అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇస్తున్నప్పటికీ.. ఆ తర్వాత చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. అక్రమార్కులతో సిబ్బంది జట్టుకట్టి ముడుపులు తీసుకొని కూల్చివేతలు చేపట్టడం లేదు. కేవలం నోటీసుల జారీ మినహా చర్యలు ఉండడం లేదు. ఈ నేపథ్యంలో ఎన్ని నోటీసులు జారీ అయ్యాయి? ఎన్ని కూల్చివేతలు చేపట్టారు? అనేది ఉన్నతాధికారులకు తెలియడం లేదు. అదే ఆన్‌లైన్‌ ద్వారా నోటీసులు జారీ చేస్తే చర్యలు తీసుకున్నది లేనిది తెలుస్తుంది. నిర్ణీత వ్యవధుల్లో నోటీసుల జారీ అనంతరం చర్యలు తీసుకోని పక్షంలో అధికారులపై యాక్షన్‌ ఉంటుంది. తద్వారా అక్రమ నిర్మాణాలకు ఎప్పటికప్పుడు కళ్లెం వేయవచ్చునని భావిస్తున్నారు. ఈ విధానాన్ని ఈ నెలలోనే అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. నోటీసుల వివరాలతో పాటు కోర్టు కేసులు, ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయనే తదితర సమా చారం కూడా ఆన్‌లైన్‌లో ఉంచాలని ఆలోచిస్తున్నారు. టౌన్‌ప్లానింగ్‌ విభాగం సంస్కరణల్లో భాగంగా ఆన్‌లైన్‌లో అక్రమ నిర్మాణాల నోటీసులతో పాటు ఓసీ, ఆస్తిపన్ను నోటీసు, టీడీఆర్‌ బ్యాంక్‌ వివరాలు కూడా అందుబాటులోకి తేనున్నట్లు చీఫ్‌ సిటీ ప్లానర్‌ దేవేందర్‌రెడ్డి తెలిపారు.  

మూడు నోటీసులు  
జీహెచ్‌ఎంసీ చట్టం టౌన్‌ప్లానింగ్‌ నిబంధనల మేరకు అక్రమ నిర్మాణాల్ని కూల్చివేయాలంటే సెక్షన్‌ 452(1) మేరకు షోకాజ్‌ నోటీసు, సెక్షన్‌ 452(2) మేరకు రెండో నోటీసు, ఆ తర్వాత సెక్షన్‌ 636 మేరకు తుది నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని సంబంధిత అధికారి తెలిపారు.   

రికార్డుల్లేవ్‌...  
గ్రేటర్‌లో అక్రమ నిర్మాణాలకు తావులేకుండా ఉండేందుకు ప్రభుత్వం దాదాపు నాలుగేళ్ల క్రితం బీఆర్‌ఎస్‌ను తెచ్చింది. ఈ పథకం ద్వారా క్రమబద్ధీకరించుకునేందుకు 1.27 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ గడువు ముగిశాక సైతం అక్రమ నిర్మాణాలు ఆగలేదు. ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వీటిల్లో ఎన్నింటికి నోటీసులిచ్చి? ఎన్నింటిని కూల్చింది? మిగిలిన వాటిని ఎందుకు కూల్చలేదో? అధికారుల వద్ద వివరాల్లేవు.  వాటి రికార్డులే లేవు. ఆన్‌లైన్‌లో నోటీసుల జారీతో ఈ వివరాలు తెలుస్తాయి.

అక్రమాలెన్నో...  
నాలుగు నెలల క్రితం తనిఖీలు చేసిన టౌన్‌ప్లానింగ్‌ అధికారులు దాదాపు 500 అక్రమ నిర్మాణాలను గుర్తించారు. వాటితో పాటు దాదాపు 3,700 ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లు, రోడ్లు తదితర ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించి నిర్మాణాలు జరుపుతున్నట్లు గుర్తించారు. అంటే నగరంలో అక్రమ నిర్మాణాలు ఏ స్థాయిలో వెలుస్తున్నాయో అంచనా వేసుకోవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement