సాక్షి, సిటీబ్యూరో: అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. గత కొంతకాలంగా జీహెచ్‌ఎంసీ సిబ్బంది మొత్తం ఎన్నికల విధుల్లో ఉండటం..అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా పట్టించుకునే సమయం లేకపోవడంతో నగరంలో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు పెరిగిపోయాయి. అసలు అనుమతులే లేకుండా Ððవెలుస్తున్న భవనాలతోపాటు రెండంతస్తులున్న భవనాలపైన మరో రెండు మూడు అంతస్తులు, నాలుగంతస్తుల భవనాలపైన అదనపు అంతస్తులు ఇటీవలి కాలంలో కుప్పలు తెప్పలుగా పెరిగిపోయాయి. అనుమతుల్లేకుండానే ఇష్టానుసారం నిర్మించారు. ఎన్నికల ముందు ఎలాగూ చర్యలు తీసుకోరనే నమ్మకంతో కొందరు..వారిని చూసి ఇంకొందరు ఎక్కడపడితే అక్కడ తామరతంపరగా అక్రమ నిర్మాణాలు పెరిగిపోయాయి. అక్రమ నిర్మాణాలపై వారం వారం జరిగే ‘ప్రజావాణి’లోనూ ఫిర్యాదులందుతున్నాయి. ఎన్నికల తరుణంలో అక్రమ నిర్మాణాలపై ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన కథనంలో అప్పట్లో చర్యలకు సిద్ధమైన అధికారులు ఎన్నికలు రావడంతో వాటిపై దృష్టి సారించలేదు.
రోజురోజుకూ అక్రమ నిర్మాణాలు తీవ్రం అవుతుండటంతో కమిషనర్ దానకిశోర్ అధికారులను చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. అక్రమ నిర్మాణాలు వెలిసేంతదాకా చోద్యం చూస్తూ..ఆ తర్వాత చర్యలకు దిగుతుండటంతో పలుసందర్భాల్లో జీహెచ్‌ఎంసీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టకపోవడాన్ని కోర్టు కూడా గతంలో తప్పుపట్టింది. దీంతో ఓవైపు భవన నిర్మాణ నిబంధనల గురించి ప్రజలకుఅర్థమయ్యేలా వివరించే కార్యక్రమాలు, అనుమతుల సరళీకరణకు సిద్ధమైన అధికారులు.. అదే తరుణంలో మరోవైపు అక్రమాలపై ఉక్కుపాదం మోపాలని కూడా నిర్ణయించారు. అందులో భాగంగా గ్రేటర్ పరిధిలోని పలు అక్రమాలను గుర్తించి తొలిదశలో 63 మందికి నోటీసులు జారీ చేయడంతో పాటు 21 నిర్మాణాలను మంగళవారం కూల్చివేశారు. స్టిల్ట్ ప్లస్ రెండంతస్తులకు మాత్రం అనుమతి పొంది .. అంతకంటే ఎక్కువ అంతస్తులు వేసినవి, పార్కింగ్ ప్రదేశంలో ఇతర నిర్మాణాలు జరిపి పార్కింగ్ లేకుండా చేసినవి, తదితరమైనవి వీటిల్లో ఉన్నాయి. వీటితోపాటు ఎలాంటి అనుమతుల్లేకుండానే చేసిన నిర్మాణాలను కూడా కూల్చివేశారు. కూల్చివేతల స్పెషల్ డ్రైవ్ మరికొన్ని రోజులు కొనసాగుతుందని డైరెక్టర్(ప్లానింగ్) కె. శ్రీనివాసరావు తెలిపారు. తిరిగి నిర్మాణాలు చేయడానికి వీల్లేకుండా ఆధునిక మెషిన్లు, సాంకేతికతతో కూల్చివేతలు జరిపినట్లు పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజాప్రతినిధుల నుంచి వ్యతిరేకత ఎదురైనా అధికారులు వెనుకాడకుండా కూల్చివేతలు కొనసాగించారు.
అధికారులు కూల్చిన వాటిల్లో..
♦ ఉప్పల్ శ్రీనగర్‌కాలనీలో అనుమతిలేని గ్రౌండ్‌ఫ్లోర్.
♦ హయత్‌నగర్ సర్కిల్‌లోని భాగ్యలతనగర్‌లో అనుమతి లేకుండా నిర్మించిన 2, 3 అంతస్తుల శ్లాబ్‌లు.
♦ హస్తినాపురం క్రాస్‌లేకుండా అనుమతి లేకుండా నిర్మించిన రెండో అంతస్తు.
♦ చైతన్యపురి ఫనిగిరి కాలనీలో అన ధికార మూడో అంతస్తు సెంట్రింగ్.
♦ ముషీరాబాద్ ఎల్‌ఐసీ కాలనీలో అనుమతి లేని మూడో అంతస్తు సెంట్రింగ్, పిల్లర్లు.
♦ టోలిచౌకి ప్రైడ్‌ఇండియా సీ–7లో అక్రమ నిర్మాణం.
♦ రాయదుర్గం పక్వాన్ హోటల్ ఎదురుగా అనధికార నిర్మాణం.
♦ చందానగర్ శంకర్‌నగర్‌లో అక్రమ నిర్మాణం.
♦ వీటితోపాటు ఖానమెట్, రామచంద్రాపురం, పటాన్‌చెరు, కేపీహెచ్‌బీ, మూసాపేట, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, గాజుల రామారం, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌లలో అక్రమ నిర్మాణాలు, అదనపు అంతస్తులు తదితరమైన వాటిని కూల్చివేశారు.
Comments
Please login to add a commentAdd a comment