
సాక్షి, యానాం : యువతులు ఇప్పుడు ఆకతాయిలను ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. అల్లరిచిల్లర పనులు చేయాలనుకుంటున్నవారి దుమ్ముదులుపుతున్నారు. మాటలతో బెదిరించడం మాత్రమే కాదు చేయి కూడా చేసుకుంటూ మరోసారి అల్లరి చేయాలనే ఆలోచన అంటేనే భయపడేలా చేస్తున్నారు. యానాంలో అల్లరికి పాల్పడిన ఓ ఆకతాయికి ఓ యువతి చుక్కలు చూపించింది. ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఇద్దరు యువతులు కలిసి యానాంలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఓ పనిమీద వచ్చారు. అదే సమయంలో అక్కడే మద్యం మత్తులో ఉన్న ఓ ఆకతాయి యువకుడు వారిపై చేయి వేసే ప్రయత్నం చేశాడు. అసభ్యంగా తాకబోయాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ యువతి అతడి దుమ్ముదులిపింది. కిందపడేసి ఈడ్చి తన్నింది. గల్లాపట్టి లాక్కెళ్లింది. చెప్పుతీసుకొని వీపు పగులగొట్టింది. పోలీసులకు ఫిర్యాదు చేసి అక్కడి నుంచి స్కూటిపై వెళ్లిపోయింది. దీంతో అక్కడ ఉన్న వారంతా ఆమె ధైర్యాన్ని ప్రశంసించారు.


Comments
Please login to add a commentAdd a comment