
మృతురాలు ప్రవీణ
ఆశయం ఆవిరైపోయింది.. వెండి తెరపై తన బొమ్మను చూసుకోవాలని పరితపించింది. తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా మహానగరంలో ఒంటరిగా కొంత కాలం మనుగడ సాగించింది. ‘ఒకే ఒక్క ఛాన్స్’ అంటూ సినీ నిర్మాతలు.. డైరెక్టర్ల చుట్టూ తిరిగింది. ప్రయత్నాలు ఎన్నో చేసింది. ఏ ఒక్కటీ కలిసి రాలేదు. ఆచూకీ పసిగట్టిన పోలీసులు అతి కష్టంపై ఆమెను తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. అయితే ఆమెలోని కళాతృష్ణను అడ్డుకోలేకపోయారు. కళాకారిణిగా పూలహారాలు అలంకరించాల్సిన మెడ చుట్టూ ఉరితాడు బిగుసుకుంది. ఓ కళాజ్యోతి వెలుగు చూడకముందే ఆరిపోయింది.
గుంతకల్లు టౌన్: పట్టణంలోని హనుమేష్‌నగర్‌కి చెందిన ప్రవీణ (17) అనే బాలిక జీవితంపై విరక్తి చెంది ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బుధవారం ఉదయం వెలుగు చూసింది. ఒన్‌టౌన్ పోలీసులు తెలిపిన మేరకు.. హనుమేష్‌నగర్‌కి చెందిన నీలావతి, ఉడదాల పెద్దన్న దంపతుల కుమార్తె ఉడదాల ప్రవీణకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే మక్కువ. తన ప్రతిభను ప్రదర్శించి ఎలాగైనా సినిమాల్లో లేకపోతే చివరకు సీరియల్స్‌లోనైనా నటించాలనుకుంది. 2016 సంవత్సరంలో ఇంటి నుంచి పారిపోయి హైదరాబాద్‌కు చేరుకుంది.
నెలరోజుల్లో తిరిగి ఇంటికి..: తల్లి ఫిర్యాదుతో అప్పట్లో ఒన్‌టౌన్ పోలీసులు మిస్సింగ్ నమోదు చేశారు. హైదరాబాద్‌లోని కృష్ణానగర్‌లో సినిమా ఛాన్స్ కోసం తిరుగుతుండటాన్ని గుర్తించి అదుపులోకి తీసుకుని కుటుంబసభ్యులకు అప్పగించారు. నెలరోజుల తర్వాత తిరిగి వచ్చిన అమ్మాయికి పెళ్లి చేస్తే కుదురుగా ఉంటుందేమోనని కుటుంబ సభ్యులు భావించారు.
జీవితాశయం నెరవేరదని..: ఇంట్లో తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలుసుకున్న ప్రవీణ ఇక తన జీవితాశయం నెరవేరదేమోనని మనస్తాపం చెందింది. మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుమార్తె మరణాన్ని తల్లి జీర్ణించుకోలేకపోయింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఒన్‌టౌన్ ఎస్‌ఐ యు.వి.ప్రసాద్ తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment