
ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని ద్రాక్షాయిని
అమ్మా నాన్నా బై. నా వల్లే ద్రాక్ష చనిపోయింది. తమ్ముడ్ని మీరు బాగా చూసుకోండి. సుచరిత, అంజలి ఇద్దరూ బాగా ఉండి.. అమ్మను బాగా చూసుకోండి. జైన నా ప్రాణం..రాజు నా ఊపిరి. నన్ను, ద్రాక్షాయినిని ఇద్దరినీ ఒకేచోట పెట్టండి. ప్లీజ్ అమ్మా! నా ఫ్రెండ్స్ అందరికీ బై.
ద్రాక్ష, అమ్మ, నాన్నకు సారీ. అయినా ద్రాక్ష తిరిగి రాదు. మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడగాలనుంది.. కానీ వీలులేదు. సారీ అంకుల్. అందుకే నేనే తన వద్దకు పోతున్నా. నా చావుకు ఎవ్వరూ కారణం కాదు. నా మనసాక్షి నన్ను చనిపో అంటోంది.
అమ్మా.. నేను మంచి జాబ్ చేసి, నిన్ను బాగా చూసుకోవాలని అనుకున్నా. నా జీవితమంతా రాజుతో కలసి ఉండాలని అనుకున్నా. కానీ నా వల్ల ద్రాక్ష చనిపోయింది. ఒక అమ్మాయి జీవితం పోయింది. నన్ను క్షమించండి.
ఇదీ ఆత్మహత్యకు ముందు పుష్పావతి అనే అమ్మాయి పడిన సంఘర్షణ. స్నేహితురాలిగా ఉన్న హాస్టల్ విద్యార్థిని అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకుంది. దీంతో మనోవేదనకు గురైన వార్డెన్ పుష్పావతి కూడా బలవన్మరణానికిపాల్పడింది. ఈ విషాదకర ఘటనలు కర్నూలు నగరంలో చోటుచేసుకున్నాయి.
కర్నూలు(హాస్పిటల్): నగర శివారులోని నందికొట్కూరు రోడ్డులో ఉన్న సెయింట్ జోసెఫ్ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని ద్రాక్షాయిని(17), అక్కడి హాస్టల్ వార్డెన్ ఎం.పుష్పావతి (24) ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆత్మకూరు మండలం కరివేన గ్రామానికి చెందిన ద్రాక్షాయిని(17) శనివారం అర్ధరాత్రి హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని ఆదివారం ఉదయం గుర్తించిన కళాశాల యాజమాన్యం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. ద్రాక్షాయిని తండ్రి నాగేశ్వరయ్య వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. ద్రాక్షాయిని అందరికంటే చిన్నది. ఆమె సెయింట్ జోసెఫ్ జూనియర్ కళాశాలలో బైపీసీ సెకండియర్ చదువుతూ హాస్టల్‌లోనే ఉండేది. నాలుగు రోజులుగా అనారోగ్యంతో ఆహారం సరిగా తీసుకోలేదని, అల్సర్‌తో బాధపడుతుండేదని తల్లిదండ్రులు చెప్పారు.
హాస్టల్ వార్డెన్ పుష్పావతి, ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ వద్ద విలపిస్తున్న పుష్పావతి కుటుంబ సభ్యులు
వార్డెన్ పుష్పావతి కూడా.. ద్రాక్షాయిని మరణాన్ని చూసి తట్టుకోలేకపోయిన హాస్టల్ వార్డెన్ పుష్పావతి కూడాఆత్మహత్యకు పాల్పడింది. ఈ సందర్భంగా ఆమె రాసిన సూసైడ్ నోట్ పలువురిని కదిలించింది. ఆమె స్వగ్రామం మిడుతూరు మండలం జలకనూరు. తండ్రి ఏసన్న, తల్లి రాజమ్మ. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఇద్దరుకుమారులు. రెండో కుమార్తె అయిన పుష్పావతి డిగ్రీ వరకు చదువుకుంది. ఇటీవల ఎస్‌ఐ పరీక్షల్లోనూ పాల్గొంది. ఇంటికి ఆసరాగా ఉండేందుకు హాస్టల్‌వార్డెన్‌గా పనిచేసేది. విద్యార్థిని ద్రాక్షాయిని, ఈమె ఇద్దరూ స్నేహితులుగా ఉండేవారని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ద్రాక్షాయిని మృతి చెందడం, ఆ తర్వాత కొన్ని గంటలకే నగరంలోని ఆనంద్ థియేటర్ సమీపంలో కేసీ కెనాల్‌కు వేసిన కంచె పైపునకు పుష్పావతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. విషయం తెలిసి కుటుంబసభ్యులు ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ వద్దకు వచ్చి కన్నీరుమున్నీరయ్యారు. కాగా.. ఈ ఘటనలపై సెయింట్ జోసెఫ్ జూనియర్ కళాశాల యాజమాన్యం నోరు విప్పడం లేదు. సంఘటన తర్వాత పోలీసులు మినహా ఎవ్వరినీ కళాశాల లోపలికి అనుమతించలేదు. ఆత్మహత్యలకు సంబంధించి కర్నూలు తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment