సాక్షి, చెన్నై : భార్య తిట్టిందన్న ఆగ్రహంతో క్షణికావేశంలో ఏం ఆలోచించకుండా పక్కనే ఉన్న సుత్తితో కొట్టి చంపేసిన ఘటన ఆదివారం రాత్రి గూడువాంజేరిలో చోటు చేసుకుంది . తర్వాత కాసేపటికి పశ్చాత్తాపంతో తానూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. గూడువాంజేరి సమీపంలోని వల్లన్‌చ్చేరి గ్రామానికి చెందిన స్టీఫెన్ సన్ (52) స్థానికంగా మద్యం బార్‌లో పార్సిల్ సప్లయర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు మూడో భార్య ఉమ(38)తో కలిసి వల్లన్‌చ్చేరిలో నివాసం ఉంటున్నాడు. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి లేకపోవడంతో ఆర్థిక అవసరాలు కూడా పెరిగిపోయాయి. దీంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఆదివారం కూడా ఇరువురి మధ్య గొడవ జరిగింది.
భార్యపై ఆగ్రహంతో ఊగిపోయిన స్టీఫెన్ పక్కనే ఉన్న సుత్తి తీసుకుని ఉమ తలపై బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. క్షణికావేశంలో భార్యను చంపేశానంటూ తొలి భార్య కుమార్తె దివ్యకు ఫోన్ చేశాడు. తాను చనిపోతున్నట్టు పేర్కొని ఫోన్ కట్ చేశాడు. దీంతో ఆందోళనకు గురైన దివ్య వల్లన్‌చ్చేరిలో ఉన్న బంధువులకు సమాచారం అందించింది. వారు వెళ్లి చూడగా అప్పటికే ఉమా రక్తపు మడుగులో కింద పడి ఉండగా, స్టీఫెన్ ఇంటి ఇనుపదూలంకు ఉరి పోసుకుని చనిపోయాడు. సమాచారం అందుకున్న గూడువాంజేరి పోలీసులు కేసు నమోదు చేశారు. మృత దేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం చెంగల్పట్టు జిల్లా కేంద్రం ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
చిచ్చురేపుతున్న లాక్‌డౌన్..
లాక్‌డౌన్ వేళ వివాదాలు, వేధింపులతో కంట్రోల్ రూమ్‌ను ఆశ్రయించే మహిళలు సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. మూడు వేల మంది వరకు ఫిర్యాదులు చేయగా, మహిళ, బాలికల సంరక్షణ ప్రత్యేక విభాగం అదనపు డీజీపీ రవి నేతృత్వంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి సామరస్య పూర్వకంగా పరిష్కారాలు, పంచాయతీలు పెట్టి బుజ్జగింపులు, హెచ్చరికలతో మందలించి వస్తున్నారు. కొన్ని చోట్ల గొడవలు మరింతగా పెరగడం హత్యకు లేదా బలన్మరణానికి పరిస్థితులు దారి తీస్తున్నాయి. క్షణికావేశం తగ్గించుకోవాలని భార్యా భర్తలు పరస్పర అవగాహన, సమన్వయం పాటించి జీవితాలను తీర్చిదిద్దుకోవాలని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment