వివరాలు వెల్లడిస్తున్న డిఎస్సీ రవివర్మ, ఇన్‌చార్జి సీఐ రాంబాబు, ఎస్సైలతో నిందుతుడు సుబ్రహ్మణ్యం
పిఠాపురం టౌన్: బైపాస్ రోడ్డులోని గోపాలబాబా ఆశ్రమం ఎదురుగా గత శుక్రవారం అర్ధరాత్రి వివాహిత మెడ, చేతులు నరికివేసిన కేసుమిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో గాయపడిన ముమ్మిడి సుబ్బలక్ష్మి భర్త సుబ్రహ్మణ్యాన్ని మంగళవారం అరెస్టు చేసి వాస్తవాలు వెల్లడించారు. పట్టణంలో సంచలనం సృష్టించిన ఈ కేసు పూర్వాపరాలను డీఎస్పీ రవివర్మ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. తొలుత గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి లోపల ఉన్న సుబ్బలక్ష్మి ముఖం మీద మత్తు మందు చల్లి ఆమె మెడ, చేతులు నరికి భర్త సుబ్రహ్మణ్యాన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని ప్రచారం జరిగినప్పటికీ సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు పొంతన కుదరకపోవడంతో కేసును దర్యాప్తు చేశారు. ఇన్‌చార్జి సీఐ రాంబాబు ఆధ్వర్యంలో పట్టణ ఎస్సై శోభన్‌కుమార్, గొల్లప్రోలు ఎస్సై శివకృష్ణ తదితరులు నాలుగు బృందాలుగా సుబ్రహ్మణ్యం కోసం గాలించారు. చివరకు సుబ్రహ్మణ్యం కోర్టులో లొంగిపోయేందుకు ప్రయత్నించి లాయర్ల కోసం అన్వేషిస్తూ తిరుగుతుండగా పిఠాపురం రైల్వే స్టేషన్ వద్ద ఎస్సై శోభన్‌కుమార్ అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.
వివరాల్లోకి వెళితే పిఠాపురం మండలం ఎఫ్‌కె పాలెం గ్రామానికి చెందిన ముమ్మిడి సుబ్రహ్మణ్యానికి, కొత్తపల్లి మండలం కొండెవరం గ్రామానికి చెందిన కర్నీడి సుబ్బలక్ష్మితో సుమారు 15 సంవత్సరాల క్రితం వివాహమైందన్నారు. వీరికి మనిషా, సతీష్‌రాజ అనే పిల్లలున్నారని చెప్పారు. వీరిద్దరూ పిఠాపురంలోని ప్రయివేటు స్కూల్‌లో చదువుతుండటంతో బిలాస్‌పూర్‌లో రైల్వేలో గుమస్తాగా పనిచేస్తున్న సుబ్రహ్మణం పదిహేను రోజులకొకసారి పిఠాపురంలోని ఇంటికి వచ్చి పోతూ ఉండేవాడని తెలిపారు.
ఇటీవలి కాలంలో భార్య సుబ్బలక్ష్మి వ్యవహార శైలిపై అనుమానం వచ్చి ఆమె పేరున ఉన్న ఆస్తులను తన పేరుకు మార్చాలని పలుమార్లు అడిగినప్పటికీ సుబ్బలక్ష్మి నిరాకరించడంతో గత శుక్రవారం రాత్రి మళ్లీ ఇద్దరికీ ఘర్షణ జరిగినట్టు పోలీసులు తెలిపారు. దీంతో అదే రోజు రాత్రి నిద్రిస్తున్న సుబ్బలక్ష్మి మెడ మీద, చేతులు మీద కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన అనంతరం తన మోటారు సైకిల్ మీద సుబ్రహ్మణ్యం పరారైనట్టు తెలిపారు. గాయాలపాలైన సుబ్బలక్ష్మిని చుట్టుపక్కల వారు కాపాడి చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన సంగతి విదితమే. ఈ కేసులో నిందితుడు సుబ్రహ్మణ్యాన్ని కోర్టులో హాజరుపరచనున్నట్టు డీఎస్పీ తెలిపారు. జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ ఆదేశాలతో ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకోగలిగామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment