భార్య ప్రియాంక, పిల్లలతో హనుమంతు (పాత ఫొటోలు)
సాక్షి, నల్గొండ : చిన్నప్పుడు తన వేలుపట్టి నడిపించిన అక్క.. అమ్మలా లాలించిన అక్క.. అకస్మాత్తుగా అదృశ్యం అయిపోయింది. ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. అప్పుడు ఊహతెలియని ఆ తమ్ముడు.. కాస్త పెద్దయ్యాక అక్క కోసం వెదకడం ప్రారంభించాడు. చివరకు అక్క ఆచూకీ అయితే తెలిసింది కాని.. తట్టుకోలేని వాస్తవం వెలుగులోకి వచ్చింది. ఏంటా నిజం..?
నల్గొండ జిల్లాకు చెందిన లింగమ్మ అలియాస్ ప్రియాంక 12 ఏళ్ల క్రితమే ప్రేమ పెళ్లి చేసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె సవతి తమ్ముడు ఉపేంద్ర. అక్క ఇంటి నుంచి వెళ్లిపోయేటప్పుడు చిన్నవాడు. ఏం జరిగిందో, అక్క ఎక్కడికి వెళ్లిందో తెలియని వయసు. కాని పెద్దయ్యాక అక్క కోసం తెలుసుకోవాలనుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిదేళ్లు ఆమె కోసం వెదికాడు. తెలిసినవాళ్లని, తెలియనివాళ్లని ఆరా తీశాడు. చివరికి ఫేస్‌బుక్‌లో బావ హనుమంతు ఫోటో చూసి అతని వివరాలు తెలుసుకున్నాడు. హనుమంతు సొంతూరు మర్రిగూడెం దగ్గర వెంకటపల్లికి వెళ్లాడు. కాని అక్కడికి వెళ్లగానే అతని ఆనందం ఆవిరైపోయింది. కట్టుకున్నోడే కాలయముడై తన అక్కను కిరాతకంగా చంపేశాడని తెలిసి ఆ తమ్ముడి గుండె బద్దలైంది.
ప్రాణం తీసిన అనుమానం
హైదరాబాద్ ఎల్బీనగర్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న హనుమంతుతో అప్పట్లో ప్రియాంకకు పరిచయం అయ్యింది. ఇంట్లో చెప్పకుండా అతడిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. రెండేళ్లు ఎల్బీనగర్‌లో ఉన్నారు. తర్వాత మర్రిగూడెంకు వచ్చేశారు. అప్పుడే ఇద్దరి మధ్య విభేదాలొచ్చాయి. భార్యపై అనుమానంతో ఆమెను దారుణంగా హింసించేవాడు. తనకు పుట్టలేదన్న అనుమానంతో 11 రోజుల పసిపాపను చంపేశాడు. ప్రశ్నించిన భార్యకు కూడా హత్య చేసి బావిలో పడేశాడు హనుమంతు. మగపిల్లాడిని తన దగ్గరే పెట్టుకుని కుటుంబంతో సంబంధాలు లేకపోవడంతో ప్రియాంక కనిపించకుండా చనిపోయినా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఉపేంద్ర రావడంతో నిజాలన్నీ బయటకొచ్చాయి.
పోలీసుల దర్యాప్తు
ఉపేంద్ర ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు హనుమంతును అరెస్ట్ చేసి విచారించారు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా వెంకటపల్లి గ్రామ శివారులోని రామిరెడ్డి బావిలో యువతి దుస్తులను గుర్తించారు. ప్రియాంక ఎముకలను బావి నుండి బయటికి తీశారు. నిర్ధారణ కోసం వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కోసం పంపారు. పదేళ్ల క్రితమే హత్య జరిగివుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యానంతరం ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్త పడుతూ వచ్చిన హనుమంతు హతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో కటకటాలపాలయ్యాడు. భార్యకు మరొకరితో అక్రమసంబంధం ఉందన్న అనుమానంతోనే హత్య చేసినట్టు నిందితుడు చెప్పాడని, దర్యాప్తు కొనసాగిస్తున్నామని జిల్లా ఎస్పీ రంగనాథ్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment