
హత్యకు గురైన సరళ
గుంతకల్లు టౌన్: పట్టణంలోని బెంచికొట్టాలకు చెందిన సరళ (33)అనే వివాహిత భర్త అబ్రహాం లింకన్ చేతిలో హత్యకు గురైందని ఒన్‌టౌన్ సీఐ ఉమామహేశ్వరరెడ్డి తెలిపారు. అదనపు కట్నం తేలేదనే సరళను భర్తే గొంతునులిమి చంపాడని చెప్పారు. సీఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం భద్రావతికి చెందిన సరళకు బెంచికొట్టాలకు చెందిన ఎలక్ట్రీషియన్ అబ్రహాంతో పదేళ్ల కిందట పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న అబ్రహాం పనికి వెళ్లకుండా పుట్టింటికెళ్లి డబ్బులు తీసుకురావాలని భార్యను నిత్యం వేధించేవాడు. శనివారం మధ్యాహ్నం కూడా ఇదే విషయమై గొడవ కాగా నిందితుడు ఆమెను గొంతు పిసికి చంపేశాడు. అయితే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని భర్త నాటకమాడాడు.
హత్య కేసు నమోదు
సరళను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆమె కుటుంబసభ్యులు ఆరోపించారు. తాము వచ్చే వరకు సరళ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ తరలించవద్దని పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు. మృతురాలి తల్లి సుబ్బమ్మ ఫిర్యాదు మేరకు అబ్రహాంపై హత్యకేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు. ఆదివారం సరళ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.