
దీపికా, విక్రం చౌహన్ (ఫైల్ ఫొటో)
గురుగ్రామ్ : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను మేడపై నుంచి తోసి చంపేశాడు. అనంతరం ప్రమాదవశాత్తు కింద పడిందని పోలీసులతో నమ్మబలికాడు. ముమ్మర దర్యాప్తు చేసిన పోలీసులు ఆమె చావుకు కారణమైన భర్తను, అతని ప్రియురాలిని అరెస్టు చేశారు. ఈ ఘటన గురుగ్రామ్‌లోని ‘వాలీ వ్యూ ఎస్టేట్’ అపార్ట్‌మెంట్‌లో గత అక్టోబర్, 27న చోటుచేసుకుంది. వివరాలు.. దీపికా చౌహన్ (32), విక్రం చౌహన్ (35) భార్యభర్తలు. వీరికి నాలుగేళ్ల పాప, 5 నెలల బాబు ఉన్నారు. అయితే, గత కొంత కాలంగా విక్రం ఎదురు ఫ్లాట్స్‌లో ఉండే షెఫాలి భాసిన్‌తో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగేవి.
ఘటన జరిగిన రోజు సాయంత్రం విక్రం దీపికా మరోమారు గొడవపడ్డారు. ‘నీ వ్యవహారాలు నచ్చడం లేదు. నన్నూ.. నా పిల్లల్ని అన్యాయం చేయొద్దు. ఇప్పుడే వెళ్లి భాసిన్ అంతు చూస్తా’ అని దీపిక హెచ్చరించింది. దీంతో తన అక్రమ సంబంధం ‘చెడిపోతుంది’ అని భావించిన విక్రం తన భార్యను హతమార్చాలని పథకం రచించాడు. మంచిగా నటించి ఆ రోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో దీపికతో బాల్కనీలో కాసేపు ముచ్చటించాడు. ఆమెను నమ్మించి ఒక్కసారిగా 8 అంతస్తుల ఎత్తు నుంచి కిందకు తోసేశాడు. తీవ్ర గాయాలపాలైన దీపిక ఆస్పత్రికి తరలించేలోపే మరణించిందని పోలీసులు తెలిపారు. కాగా, ఈ హత్యలో విక్రమ్‌కి సహకరించాడనే అనుమానంతో మరోవ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు డీఎల్‌ఎఫ్ ఫేజ్-1 పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ సంజీవ్ కుమార్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment