వివిధ నేరాలకు పాల్పడే నేరగాళ్ల సమాచారాన్ని పక్కాగా సేకరించాలని సిటీ పోలీస్ విభాగం నిర్ణయించింది. ఏదైనా కేసులో అరెస్టయిన నేరగాడి ఆధార్ నెంబర్ తప్పకుండా సేకరించి ప్రత్యేక డేటా బేస్‌లో పొందుపరుస్తారు. తద్వారా ఆ నేరగాడు ఒకటి కంటే ఎక్కువ నేరాలకు పాల్పడినా...పేర్లు మార్చినా..తప్పుడు విధానాలకు పాల్పడినా అతన్ని వెంటనే గుర్తించడం తేలికవుతుంది.
సాక్షి, హైదరాబాద్: తార్నాక ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని గతేడాది పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. వరుసగా నేరాలు చేయడానికి అలవాటు పడిన ఆ నిందితుడు ఈ ఏడాది మరోసారి బహదూర్‌పురా పోలీసులకు చిక్కాడు. అయితే రెండోసారి తన పేరును మార్చి చెప్పడంతో అతగాడి పాత చరిత్ర వెలుగులోకి రాలేదు. దీంతో అతడిపై ‘కఠిన చర్యలు’ తీసుకోవడానికి పోలీసులకు అవకాశం లభించలేదు. ఈ నేపథ్యంలో అతగాడు పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నా... నేర చరిత్ర ఉన్నా జారీ అయిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటివి ఉత్పన్నం కాకుండా ఉండటానికి, నేరగాళ్లను కట్టడి చేయడానికి, వారి గత చరిత్రను ఎప్పకప్పుడు తెలుసుకోవడంతో పాటు పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ పక్కాగా జరగడానికి నగర పోలీసు విభాగం నిందితుల ఆధార్ నెంబర్ నమోదు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏదైనా తీవ్రమైన నేరంలో అరెస్టు అయిన వ్యక్తుల ఆధార్ నెంబర్లు సైతం పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌తో సహా రికార్డుల్లో పొందుపరుస్తున్నారు.
‘పేర్లు’ మారుస్తూ తప్పుదారి...
ఏటా 18వేలకు పైగా కేసులు నమోదయ్యే సిటీ కమిషనరేట్‌లో నిందితులందరినీ పోలీసు అధికారులు గుర్తుంచుకోవడం కష్టం. దీనితోడు నగరంలో ఉన్న ఐదు జోన్లలో ఓ జోన్ పరిధిలో అరెస్టు అయిన వ్యక్తి పూర్తి సమాచారం, మరో జోన్ అధికారుల వద్ద అందుబాటులో ఉండదు. ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న టెక్నికల్ ప్లాట్‌ఫామ్‌తో ఇది కొంత వరకు అమలవుతున్నా, పాస్‌పోర్ట్స్ వెరిఫికేషన్ వద్దకు వచ్చే సరికి పూర్తి స్థాయిలో ఫలితాలు ఉండట్లేదు. దీనికితోడు నేరగాళ్లు వేస్తున్న ఎత్తులు అధికారులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతన్నాయి. నగర పోలీసులు గడిచిన రెండున్నరేళ్లుగా ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్‌ను విస్త్రృతంగా వినియోగిస్తున్నారు. పదేపదే నేరాలు చేసే వారిని గుర్తిస్తూ, ఏకకాలంలో మూడు కేసుల్లో నిందితులుగా ఉన్న వారిపై దీన్ని ప్రయోగిస్తున్నారు. ఈ భయానికి తోడు వరుసగా నేరాలు చేసే నేరగాళ్లలో కొందరు తమ చరిత్ర వెలుగులోకి రాకుండా ఉండేందుకూ కొత్త ఎత్తులు వేయడం ప్రారంభించారు. ఓసారి అరెస్టు అయినప్పుడు ఇంటి పేరు ముందు, అసలు పేరు వెనుక చెప్తూ, మరోసారి అరెస్టు అయిన సందర్భంలో పేరు ముందు, ఇంటి పేరు వెనుక చెప్పడంతో పాటు పేర్లలో కొన్ని మార్పులు చేస్తున్నారు.
స్పెల్లింగ్‌లో మార్పుచేర్పులతో...
ఇలాంటి ‘మార్పిడిగాళ్లు’ పూర్తిగా తమ పేర్లను మార్చరు. అరెస్టు అయిన ప్రతిసారీ బెయిల్ పొందడం కోసం న్యాయస్థానంలో ధ్రువీకరణలు ఇవ్వాల్సి ఉంటుంది. తప్పుడు పేరు చెప్తే అక్కడ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఎక్కువగా స్పెల్లింగ్స్ మార్చేస్తూ కథ నడుపుతున్నారు. ఉదాహరణకు పేరు చివరలో ‘అయ్య’ అని వచ్చే పేరునే తీసుకుంటే ఓసారి అరెస్టు అయినప్పుడు చివరి స్పెల్లింగ్ ‘వైవైఏ’ అంటూ, మరోసారి చిక్కినప్పుడు దీన్ని ‘ఐఏహెచ్’గా రాస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా కేటుగాళ్ల సంఖ్య పెరిగినట్లు పోలీసు విభాగం గుర్తించింది. ఇలాంటి నేరగాళ్లకు చెక్ చెప్పడానికి వివిధ కేసుల్లో అరెస్టు అయిన నిందితుల ఆధార్ నెంబర్ రికార్డు చేసుకోవడం తప్పసరి చేస్తూ నగర పోలీసు విభాగం నిర్ణయం తీసుకుంది. ఓ వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ జారీ అయితే వారి ఆధార్ నెంబర్లు సేకరించరు. కేవలం అరెస్టు అయిన వారివి మాత్రమే తీసుకుంటున్నారు. అదీ ప్రతి కేసులోనూ కాకుండా సొత్తు సంబంధ నేరాలు, మోసాలతో పాటు హత్య, హత్యాయత్నం తదితర వాటిలో నిందితుల నుంచే సేకరిస్తున్నారు. ఈ నిందితుల ఆధార్ సంఖ్యల డేటాబేస్‌ను ఆన్‌లైన్ లో ఉంచి సర్వర్‌తో అనుసంధానిస్తున్నారు. పోలీసు యాప్స్ ద్వారా అన్ని ఠాణాలకు అందు బాటులోకి తీసుకొచ్చారు. ఫలితంగా ఓ వ్యక్తి వేర్వే రు కేసుల్లో చిక్కినప్పుడుతప్పుడు వివరాలు చెప్పే ఆస్కారంఉండట్లేదు.తదుపరి విచారణలు, పోలీ సు వెరిఫికేషన్లు సైతం పక్కాగాజరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment