
లక్నో : ఓ దొంగ స్వామీజీ తనపై ప్రతి రోజు లైంగిక దాడికి పాల్పడేవాడని యువతి ఆరోపించింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఇప్పటికే బాబాల పేరిట పలువురు చేస్తున్న మోసాలు బయటకు వచ్చి సంచలనంగా మారుతున్న ఈతరుణంలో వెలుగు చూసిన ఈ ఘటన కలకలం రేపుతోంది. పోలీసుల వివరాల ప్రకారం సియా రామ్ దాస్ అనే వ్యక్తి బాబా వేషంలో ఉంటూ అనేక మోసాలకు పాల్పడ్డాడు. ఓ యువతిని తన వద్ద బంధించి ఎనిమిది నెలలపాటు లైంగికదాడికి పాల్పడ్డాడు.
అనంతరం అతడి శిష్యులు కూడా వరుసగా ఆమెపై లైంగిక దాడులు చేశారు. ఓ మహిళా శిష్యురాలికి తనను తన బంధువులే రూ.50 వేలకు అమ్మేశారని, తొలుత తనను లక్నో తీసుకెళ్లి అక్కడి నుంచి మిష్రిక్ ఆశ్రమానికి తీసుకెళ్లారని తెలిపింది. అప్పటి నుంచే తనపై లైంగికదాడి జరగడం మొదలైందని, ఎనిమిది నెలలపాటు తనపై ఈ దాడి జరిగిందని వాపోయింది.
అంతేకాకుండా ఆ బాబా గురించి షాకింగ్ విషయాలు కూడా బాధితురాలు చెప్పింది. అక్కడి నుంచి తనను ఆగ్రాకు పంపారని అక్కడే తనను ఎనిమిది నెలలు ఉంచి ఈ చర్యలకు పాల్పడి ఎంఎంఎస్‌లు తీసి బెదిరించారని తెలిపింది. బాబా సెక్స్ రాకెట్ కూడా నడిపేవాడని, రాజకీయ నాయకులకు, ప్రభుత్వ ఉద్యోగులకు స్కూళ్లల్లో చదువుతున్న అమ్మాయిలను బలవంతంగా బెదిరిస్తూ పంపించేవాడని కూడా వాపోయింది. కాగా, అసలు బాధితురాలు తనకు తెలియదేని, ఆమెను తాను చూడనే లేదని సియా రామ్ దాస్ అన్నారు. ప్రస్తుతం పోలీసులు అతడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.