
బిడ్డతో షాజాద్ ఖాన్ (ఫైల్ ఫోటో)
సాక్షి, శ్రీనగర్ : సుంజ్వాన్ ఉగ్రదాడిలో గాయపడిన క్షతగాత్రులు ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. తాజాగా వీరిలో మగ్గురు కన్నుమూయటంతో మృతుల సంఖ్య 9కి చేరుకుంది. ఇక కాల్పుల్లో ఓ గర్భిణి గాయపడిన విషయం తెలిసిందే. అయితే ఆమె కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలపై ఆశలు వదిలేసుకున్న ఆ కుటుంబంలో ఇప్పుడు సంతోషం వెల్లివిరుస్తోంది. అద్భుతం జరిగి ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
శనివారం ఆర్మీ కార్టర్స్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో.. రైఫిల్‌మ్యాన్ నజీర్ అహ్మద్‌తోపాటు ఆయన భార్య షాజాద్ ఖాన్(24) తీవ్రంగా గాయపడ్డారు. ఆమె వెన్నెముకలోకి తూటా దూసుకుపోవటంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. 35 వారాల గర్భిణి అయిన ఆమెను హుటాహుటిన ప్రత్యేక హెలికాప్టర్‌లో సత్వారీలోని మిలటరీ ఆసుపత్రికి తరలించారు.
ఇద్దరికీ ప్రాణాపాయం ఉందని వైద్యులు చెప్పటం బిడ్డపై కుటుంబ సభ్యులు ఆశలు వదులుకుని.. కనీసం తల్లినైనా రక్షించాలని వేడుకున్నారు. చివరకు ఆమెకు ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు తర్వాత సిజేరియన్ చేయటంతో ఆమె ఆడశిశువుకు జన్మనిచ్చింది. 2.5 కేజీల బరువుతో ఆ బిడ్డ, తల్లీ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. కాగా, తీవ్ర రక్తస్రావంతో తల్లి, బిడ్డా ఇద్దరూ బతకటం కష్టమని భావించామని.. కానీ, ఏదో అద్భుతం జరిగినట్లు ఇద్దరూ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారని ఆర్మీ డాక్టర్లు చెబుతున్నారు. కాగా, గాయపడిన ఆమె భర్త అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment