
మృతుడు విజయ్‌కుమార్
గుణదల (విజయవాడ ఈస్ట్) : విధి నిర్వహణలో ఉన్న ఇంటిలిజెన్స్ ఉద్యోగి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బాపట్ల నగరం నర్సాయపాలెం ప్రాంతానికి చెందిన కట్టా విజయకుమార్ (37) ప్రస్తుతం కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో కుటుంబంతో ఉంటున్నారు. ఇంటెలిజెన్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తున్నారు. అతనికి భార్య ఏసువాణి, కుమార్తె థెరిసా ఉన్నారు. విధి నిర్వహణలో భాగంగా సోమవారం విజయవాడకు వచ్చారు.
రాత్రి 11 గంటల సమయంలో మొగల్రాజపురం సున్నపు బట్టీల సెంటర్‌కు చేరుకున్నారు. సమీపంలో ఉన్న లక్ష్మీదుర్గ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో టిఫిన్ చేస్తూ కుప్పకూలిపోయారు. పరిస్థితి అర్థం కాని స్థానికులు అతనిని తట్టిలేపే ప్రయత్నం చేశారు. ఎంతకీ లేవకపోవడంతో మాచవరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించిన పోలీసులు 108 సహాయంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుండెపోటుతో చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. గతంలో కూడా ఒకసారి గురైనట్లు దర్యాప్తులో తేలిందని అంటున్నారు. ఏదైనా పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగానే కేసు నిర్ధారిస్తామని పోలీసులు తెలిపారు.
కన్నీరుమున్నీరుగా రోదన
విజయకుమార్ మృతి చెందారన్న వార్త వినగానే కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. భార్య, కుమార్తె, బంధువులు సోమవారం అర్ధరాత్రి ప్రభుత్వాసుపత్రి వద్దకు చేరుకుని మృతదేహం వద్ద కన్నీరు మున్నీరుగా విలపించారు. నిన్నటి వరకూ కళ్ల ముందు తిరిగిన వ్యక్తి విగత జీవిగా మారటంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. విధి నిర్వహణలో మృతి చెందినందుకు ఇంటెలిజెన్స్ పోలీసులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఇబ్రహింపట్నానికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అంకిత భావంతో విధులు
రైతువారీ పద్ధతిలో పెరిగిన విజయకుమార్ కష్టపడి చదివి 2005 లో ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సంపాదించారు. 2009లో పదోన్నతి పొంది ఇంటెలిజెన్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. రానున్న రోజుల్లో మంచి ఉన్నతాధికారిగా ఎదగాలనే కోరిక తీరకుండానే మృతి చెందారు. పోలీస్ లాంఛనాల ప్రకారం మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment