
ప్రతీకాత్మక చిత్రం
జలంధర్ : పెళ్లినాటి ప్రమాణాలను మర్చిపోయి పరాయి స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను దారుణంగా శిక్షించిందో ఇల్లాలు. అతని సున్నిత భాగాన్ని కోసి, టాయిలెట్ బేసిన్‌లో పారేసింది. పంజాబ్‌లోని జలంధర్ పట్టణంలో మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంరేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
జోగీందర్ నగర్‌లో నివసించే ఆజాద్ సింగ్, అతని భార్య సుఖ్వంత్ కౌర్‌లు తరచూ గొడవపడేవారు. అతను వేరొక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని భార్య అనుమానం. ఎన్నిసార్లు చెప్పినా అతనిలో మార్పురాకపోవడంతో కౌర్ తీవ్ర నిర్ణయం తీసుకుంది. భర్త నిద్రపోతున్న సమయంలో రాడ్డుతో తలపై బలంగా మోదింది. ఆ దెబ్బకే అతను స్పృహకోల్పోయాడు. తర్వాత కత్తితో అతని సున్నిత భాగాలను కోసేసి, టాయిలెట్ బేసిన్‌లో పారేసి నీళ్లు పోసింది.
కొడుకు పరిస్థితిని గుర్తించిన ఆజాద్ తండ్రి.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించాడు. కోడలిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆజాద్ పరిస్థితి విషమంగా ఉందని, మరికొద్ది గంటలు గడిస్తేగానీ ఏమీ చెప్పలేమని వైద్యులు పేర్కొన్నారు. బాధితుడి తండ్రి ఫిర్యాదుమేరకు పోలీసులు సుఖ్వంత్ కౌర్‌ను అరెస్టు చేశారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు.