
జేసీ దివాకర్‌రెడ్డి (పాత ఫొటో)
సాక్షి, గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి చెందిన సూట్‌కేసులో నగదును కారు డ్రైవర్ చోరీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఈనెల 11వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో దివాకర్‌రెడ్డి విజయవాడ వచ్చి గాంధీనగర్‌లోని ఓ హోటల్‌లో దిగారు. సొంత పని మీద కారులో సచివాలయానికి వెళ్లి తిరిగి 2.30 గంటల సమయంలో హోటల్‌కు చేరారు. కారులో ఉన్న సూట్‌కేసు తీసుకువచ్చి గదిలో పెట్టమని కారు డ్రైవర్ గౌతమ్‌కు చెప్పారు. డ్రైవర్ సూట్ కేసు తీసుకొచ్చి జేసీ బస చేసిన రూమ్‌లో పెట్టి వెళ్లిపోయాడు.
సాయంత్రం 6 గంటల సమయంలో జేసీ దివాకర్‌రెడ్డి సూట్ కేసు చూసుకోగా అందులో ఉన్న రూ.6 లక్షలు కనిపించలేదు. వెంటనే ఆయన క్రైం డీసీపీ కోటేశ్వరరావుకు సమాచారం అందించారు. కారులోంచి డ్రైవర్ సూట్ కేసు తెచ్చాడని తెలుసుకున్న పోలీసులు డ్రైవర్ గౌతమ్‌ను విచారించారు. సూట్‌కేసులో రూ.6 లక్షలు తీసి కారు సీటు కవర్‌లో దాచినట్లు గౌతమ్ అంగీకరించడంతో నగదు స్వాధీనం చేసుకుని పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment