ఇంతియాజ్ మృతదేహం
కృష్ణా, కంచికచర్ల (నందిగామ) : పొట్టకూటి కోసం వచ్చిన వేరే రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు నేషనల్ హైవే సేఫ్టీ అధికారులు నిత్యం వేధించటం వల్ల మానసికంగా కృంగిపోయి ఆత్యహత్య చేసుకున్న ఘటన కంచికచర్ల బైపాస్ రోడ్డులో జరిగింది. ఎస్‌ఐ దావాల సందీప్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మహ్మద్ ఇంతియాజ్ (28) అనే యువకుడు కొంతకాలంగా లక్ష్మీ ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ (లిడ్‌ఐపీఎల్) బేస్ క్యాంపులో ట్రక్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.
వారం రోజుల క్రితం ట్రక్‌లోని డీజిల్ కొంత మాయమైంది. గమనించిన హైవే అధికారులు డీజిల్ మాయమవడానికి కారణం ఏమిటని ఇంతియాజ్‌తో పాటు మరో ముగ్గురిని నిత్యం చితకబాదుతూ వేధిస్తున్నారు. దీంతో చేయని నేరానికి తనను అధికారులు చిత్రహింసలకు గురి చేస్తున్నారని మనస్తాపం చెందిన ఇంతియాజ్ ఫ్యాన్‌కు పొడవాటి టవల్‌తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సేఫ్టీ అధికారులు అంకమరావు, శ్రీధర్, చిన్నా ప్రతి రోజు కొట్టి మానసికంగా హింసించడం వల్లే ఇంతియాజ్ ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి సోదరుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నందిగామ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment