హోదాకు తగ్గ వ్యక్తిని ప్రేమిస్తున్నాను..నన్ను మర్చిపో | Wife Cheating Husband Selfie Suicide In Krishna | Sakshi
Sakshi News home page

డాడీ..ఐయామ్‌ సారీ !

Published Wed, Jul 4 2018 12:53 PM | Last Updated on Tue, Nov 6 2018 8:16 PM

Wife Cheating Husband Selfie Suicide In Krishna - Sakshi

తన కుమారుడిని పొట్టనపెట్టుకున్నారంటూ విలపిస్తున్న గురవారెడ్డి తల్లి, భార్య గాయత్రితో భర్త గురువారెడ్డి (ఫైల్‌)

‘డాడీ... ఐయామ్‌ సారీ..ఇంతగా బాధపెడతానని అనుకోలేదు..గాయత్రి నిన్ను ఎంతగా ప్రేమించానో నీకు తెలుసు.. నన్ను ఎంత బాధపెట్టావో నీకు కూడా తెలుసు... చేయని తప్పుకు లోపల కూర్చోబెట్టావు.. నీవు బాగానే ఉన్నావు.. నా చావుకు కారణం నీవు, మీ అమ్మ, నాన్న, అన్నయ్య కూడా... రాత్రికి రాత్రి మాట మార్చేస్తారా మీరు..? డాడీ, మమ్మీ అయామ్‌ సారీ.. కిట్టు మమ్మి వాళ్లను జాగ్రత్తగా చూసుకో’..అంటూ తన మనసులోని బాధను సెల్ఫీ నోట్‌ద్వారా వాట్సప్‌ చేసి రైలు పట్టాలపై పడి గురవారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు.

కృష్ణలంక(విజయవాడ తూర్పు): ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య  తనను మోసం చేసిందని గురవారెడ్డి తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. తెలిసో తెలియకో తప్పుచేసినా సరిదిద్దుకోమని చెప్పాడు. అయినా మాట వినలేదు. విషయాన్ని అత్తమామలకు చెప్పి మందలించి సరిదిద్దమన్నాడు. వారు కూడా కూతురు పక్షానే మాట్లాడి అల్లుడిని పోలీస్‌స్టేషన్‌లో పెట్టి కొట్టించారు. కూతురు చేసిన తప్పు సరిదిద్దుతారని వారికి చెబితే తనపైనే కేసు పెట్టి పోలీసులతో కొట్టించారనే తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

విజయవాడ కృష్ణలంక గుంటూరువారివీధిలో నివాసముంటున్న గురువారెడ్డి (28) ఇంటర్‌ చదివి జెంజిసర్కిల్‌ వద్ద ఒక లాడ్జిలో గుమస్తాగా పనిచేస్తుంటాడు. ఎదురింట్లో నివాసముండే గాయత్రి ఇంటర్‌ చదువుతుండగా  ఒకరంటే, ఒకరు ఇష్టపడ్డారు. ఆ ఇష్టం కాస్తా ప్రేమగా మారటంతో ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి ఐదేళ్ల కిందట పెళ్లి చేసుకున్నారు. భార్య చదువుకుంటాను అంటే భర్త బీటెక్‌ వరకు చదివించి ఆమె కోరిక మేరకు హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం ఇప్పించాడు. భర్త నగరంలోనే ఉండగా ఆమె హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ ప్రతి నెలా విజయవాడ వచ్చి వెళ్తుండేది. ఇటీవల ఆమె ప్రవర్తనలో తీవ్ర మార్పులు చోటుచేసుకోడం భర్త గమనించాడు. రోజూ ఫోన్‌చేసే భార్య అకస్మాత్తుగా మానేసింది. తాను చేస్తే స్పందించడంలేదు. ప్రతి నెలా వచ్చే భార్య రావటం పూర్తిగా ఆపేసింది.

బతిమిలాడినా....
దీంతో హైదరాబాద్‌ వెళ్లి భార్యను నిలదీస్తే భర్త గుండెలు పగిలే నిజాలు చెప్పింది. ‘నీవంటే నాకుఇష్టం లేదు... తెలిసీ తెలియని వయస్సులో నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను... నీతో ఉండటం నాకు ఇష్టం లేదు.. ఇక్కడ నా హోదాకు తగిన వ్యక్తిని ప్రేమిస్తున్నాను.. ఆయన్నే పెళ్లి చేసుకుంటాను.. నా గురించి ఆలోచించవద్దంటూ’  కరాఖండిగా తెలపడంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు. తెలిసో తెలియకో తప్పు చేశావు ప్రవర్తన మానుకొని వచ్చేయి... కలసి సంతోషంగా జీవిద్దామని భార్యను బతిమిలాడినా మాట వినలేదు. 

భార్యను మర్చిపోవాలని బెదిరింపులు....
దీంతో విషయం పెద్దల సమక్షంలో మాట్లాడుకుందామంటూ గత శనివారం గాయత్రిని తీసుకొని ఆమె తల్లిదండ్రుల వద్దకు వెళ్లాడు. మొదటి నుంచి వీరి ప్రేమ వివాహం ఇష్టంలేని వారు కూతురు తరపునే మాట్లాడారు. తమ కూతురిని మర్చిపోవాలని, లేకపోతే వేధించినట్లు కేసు పెడతామంటు భయపెట్టారు. అదే రోజు రాత్రి నాట కీయ పరిణామాల మధ్య గాయత్రి, ఆమె అమ్మ, నాన్న, అన్నయ్యలు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో వారి బంధువులు ఆంధ్రా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

పోలీసులతో కొట్టించి...
మరుసటి రోజు ఆదివారం గాయత్రి భర్త తనపై, తన కుటుంబంపై వేధింపులకు పాల్పడుతున్నారంటు కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు గురువారెడ్డిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి తీవ్రంగా కొట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విచారణ నిమిత్తం సోమవారం తిరిగి రావాలంటూ అదేశించడంతో భార్య చేసిన మోసంతో తీవ్ర మానసికక్షోభ అనుభవిస్తున్న గురువారెడ్డి పోలీస్‌స్టేషన్‌కు వెళితే వారు పెట్టే చిత్రహింసలకు భయపడి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని సోమవారం ఉదయం 11 గంటల తన చావుకు గల కారణాలను తెలియజేస్తు సెల్ఫీ వీడియోతీసి తన సోదరుడు, మిత్రులకు వాట్సప్‌చేసి రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వేధింపులతోనే ఆత్మహత్య....
విచారణ పేరుతో సోమవారం ఉదయం ఇద్దరు కానిస్టేబుల్స్‌ ఇంటికి వచ్చి తన బిడ్డను తీసుకువెళ్లారని, అదే వాడి చివరి చూపు అని తమకు తెలియదని, రాత్రి 8 గంటలకు మీ బిడ్డ చనిపోయాడంటూ పోలీసులు తెలిపారన్నారు. గాయత్రి కుటంబసభ్యులు, పోలీసుల వేధింపులతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని తల్లి, నానయ్మ సీతమ్మలు బోరున విలపించారు. గురవారెడ్డి చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement