'హార్మోనియం వాయించుకో.. వెచ్చగా ఉంటుంది' | Jokes traded by Lalu Prasad and Judge Shivpal Singh | Sakshi
Sakshi News home page

'హార్మోనియం వాయించుకో.. వెచ్చగా ఉంటుంది'

Published Sat, Jan 6 2018 4:41 PM | Last Updated on Sat, Jan 6 2018 4:42 PM

Jokes traded by Lalu Prasad and Judge Shivpal Singh - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఒక కేసులో దోషిగా తేలి శిక్ష ఖరారు చేసే సమయంలో ఆ వ్యక్తి ముఖంలో సహజంగా భయం ఉంటుంది. న్యాయమూర్తి ఎన్నేళ్ల జైలు శిక్ష విధిస్తారోనని దిగులు ఉంటుంది. కానీ, దాణా కుంభకోణం కేసులో అరెస్టు అయ్యి దోషిగా తేలిన బీహార్‌ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్ ముఖంలో మాత్రం ఆ ఛాయలు కనిపించలేదు. పైగా కోర్టులో న్యాయమూర్తి శివపాల్‌ సింగ్‌కు ఆయనకు చాలా సరదా సంభాషణ సాగింది. అది మాములుగా కాదు.. కడుపుచెక్కలయ్యేలా నవ్వుకునేంత జోకులతో.. ఇంతకీ లాలూ, న్యాయమూర్తి ఏం మాట్లాడుకున్నారంటే..

లాలూ : జైలులో బాగా చల్లగా ఉంది

జస్టీస్‌ శివపాల్‌ సింగ్‌ : నీకు చలిగా ఉంటే హార్మోనియం, తబలా వాయించుకో వేడిగా ఉంటుంది

లాలూ : జైలులో ట్రాన్స్‌జెండర్స్‌ తోటి ఖైదీలను పెళ్లి చేసుకోండంటూ వేధిస్తున్నారు.  

జస్టీస్‌ శివపాల్‌ సింగ్‌ : ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారు కదా ! అంతా చక్కబడుతుంది.

 లాలూ : దయచేసి చాలా శాంతమైన మనసుతో నాకు శిక్షను ఖరారు చేయండి

జస్టీస్‌ శివపాల్‌ సింగ్‌ : మీ మంచికోరుకునే వారు కూడా నాకు ఫోన్‌లు చేశారు. మీరేం బాధపడవద్దు.. మీకు శిక్ష విధించేటప్పుడు చట్టాన్ని మాత్రమే అనుసరిస్తాను.

అలాగే, లాలూకు శిక్ష విధించే సమయంలో ఓపెన్‌ జైలులో ఉంచితేనే మంచిదని న్యాయమూర్తి శివపాల్‌ సింగ్‌ అన్నారు. ఎందుకంటే గోవుల పెంపకం ఎలాగో తెలుస్తుందంటూ చమత్కరించారు. దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్‌ యాదవ్‌తోపాటు మొత్తం 15మందికి జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. లాలూకు మూడున్నరేళ్ల జైలు శిక్షతోపాటు రూ.5లక్షల జరిమాన విధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement