
కాన్సస్: అమెరికాలోని కాన్సస్ పట్టణంలోని టెక్విలా కేసీ బార్‌లో కాల్పుల కలకలం చెలరేగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో అయిదుగురు గాయపడ్డారు. పాత కక్షలతోనే కాల్పులు జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాల్పులకు పాల్పడిన ఇద్దరు వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాల్పులకు ముందు నిందితులు ఇద్దరూ బార్‌లోనే ఉన్నారు. అయితే నిందితులకు, లోపల ఉన్న వారికి ఏవో భేదాభిప్రాయాలు రావడంతో ఈ ఇద్దరూ బయటకు వెళ్లి, రాత్రి 1.30 గంటలకు తుపాకులతో లోపలికి వచ్చారు. అనంతరం బార్‌లో ఉన్న వారిపై కాల్పులు జరపడం ప్రారంభించారని పోలీస్ అధికార ప్రతినిధి థామస్ తెలిపారు. కాల్పులు జరిగిన సమయంలో బార్‌లో 40 మంది వరకూ ఉన్నారని వెల్లడించారు. కాల్పులు ప్రారంభం కాగానే లోపల ఉన్నవారంతా వివిధ మార్గాల గుండా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారని తెలిపారు. కాల్పుల వెనుక జాత్యహంకార విద్వేషం ఉన్నట్లు తాము భావించడం లేదని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment