బెంగళూర్ : ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఉద్యోగులుగా చెప్పుకుంటూ ప్రజలకు కుచ్చుటోపీ పెట్టిన ఇద్దరు వ్యక్తులను మంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను షౌకత్ అహ్మద్ (కశ్మీర్), బల్జీందర్ సింగ్(పంజాబ్)లుగా గుర్తించారు. షౌకత్ డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌గా, సింగ్ ఆయన డ్రైవర్‌గా చెబుతూ దేశవ్యాప్తంగా పలువురిని బురిడీ కొట్టించారని పోలీసులు వెల్లడించారు. గోవా, ముంబై, కర్ణాటక, చత్తీస్‌గఢ్, హైదరాబాద్, అమృత్‌సర్ వంటి పలు ప్రాంతాల్లో తాము పలువురిని మోసగించినట్టు విచారణలో నిందితులు అంగీకరించారు. డబ్ల్యూహెచ్‌ఓలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వారు ప్రజల నుంచి పెద్దమొత్తంలో డబ్బు సేకరించారు. ఒక్కొక్కరి నుంచి రూ 5 నుంచి రూ 10 లక్షల వరకూ డబ్బులు గుంజినట్టు పోలీసులు వెల్లడించారు. మరోవైపు మ్యాట్రిమోనీ సైట్‌లో డబ్ల్యుహెచ్‌ఓ డైరెక్టర్‌గా ప్రొఫెల్ తెరిచిన షౌకత్ ఆ హోదాను అడ్డుపెట్టుకుని పలువురు మహిళలను మోసగించాడు. ఈనెల 17న మంగుళూర్‌లో డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ నేమ్ ప్లేట్‌తో కూడిన కారులో ఇద్దరు వ్యక్తులు సంచరిస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు వలపన్ని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. డబ్ల్యుహెచ్‌ఓకు షౌకత్ గురించిన సమాచారం అందించగా ఆ పేరుతో తమ సంస్థలో ఎలాంటి ఉద్యోగి లేడన్న సమాధానం రాగా పోలీసులు తమదైన శైలిలో విచారించి నిందితుల నిర్వాకం బయటకులాగారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment