సాక్షి, అమరావతి: ఏదైనా ఒక వస్తువును ఉత్పత్తి చేయాలంటే దానికి తగిన యంత్రాలు అవసరమని ఏ చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడు. కానీ, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మి, కుమారుడు శివరాం యంత్రాలే లేకుండా కంపెనీని సృష్టించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రూ.కోట్ల విలువైన ఆర్డర్లు పొందారు. ఈ అవినీతి బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రుల్లో చికిత్సలకు ఉపయోగించే కాటన్, బ్యాండేజీలను తయారు చేసే కంపెనీ స్థాపించామంటూ నకిలీ డాక్యుమెంట్లతో లైసెన్సులు పొందారు. ఇందుకు అధికార బలాన్ని వాడుకున్నారు. తమిళనాడు నుంచి తీసుకొచ్చిన నాసిరకం కాటన్, బ్యాండేజీని ప్రభుత్వానికి సరఫరా చేసి, ఖజానా నుంచి భారీగా నిధులు మింగేశారు. స్మాల్ స్కేల్ యూనిట్ల(ఎస్‌ఎస్‌ఐ) పేరుతో రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల సంస్థకు (ఏపీఎంఎస్‌ఐడీసీ) దరఖాస్తు చేసి, అధికార బలంతో ఆర్డర్లు తెచ్చుకున్నారు. రాష్ట్రంలో చిన్న పరిశ్రమలు నడుపుకుంటూ నాణ్యమైన కాటన్, బ్యాండేజీలు తయారు చేసే వారి నోట్లో మట్టి కొట్టారు.
‘సేఫ్’ యాజమాన్యానికి నోటీసులు
ఔషధ నియంత్రణ అధికారులు రెండు రోజుల క్రితం కోడెల శివప్రసాదరావు కుటుంబానికి చెందిన ‘సేఫ్’ కంపెనీలో తనిఖీలు నిర్వహించారు. అక్కడ ఒక భవనం ఉంది గానీ అందులో ఎలాంటి యంత్రాలు లేవని నిర్ధారించారు. ఇదే అంశంపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. కోడెల కంపెనీ ఏం చేసిందంటే.. తమిళనాడులోని చెన్నై, కోయంబత్తూరు నుంచి నాసిరకం కాటన్, బ్యాండేజీలను తీసుకొచ్చింది. వాటిని తామే తయారు చేశామంటూ ‘సేఫ్’ కంపెనీ పేరిట లేబుళ్లు వేసి, ప్రభుత్వానికి అంటగట్టింది. తమకు కంపెనీ ఉన్నట్లు కోడెల కుటుంబం డ్రగ్ లైసెన్స్ కూడా తీసుకుంది. లేని కంపెనీకి లైసెన్సు ఎలా ఇచ్చారో అప్పటి అధికారులే చెప్పాలి. ఔషధ నియంత్రణ అధికారులు ఇచ్చిన నివేదికతో ‘సేఫ్’ కంపెనీని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ జాబితా నుంచి తొలగించినట్టు ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారులు తెలిపారు. ఆ కంపెనీకి ఇకపై ఆర్డర్లు ఇవ్వబోమని తేల్చిచెప్పారు. ‘సేఫ్’ యాజమాన్యానికి ఇప్పటికే ఔషధ నియంత్రణ శాఖ నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది.
గడ్డిలోనూ దిగమింగారు
ఆరోగ్య శాఖలోనే కాదు పశు సంవర్థక శాఖలోనూ కోడెల తన కంపెనీ పేరుతో భారీగా దాణా కుంభకోణానికి పాల్పడ్డారు. ఎండు గడ్డి సరఫరా చేస్తామంటూ పశు సంవర్ధక శాఖ నుంచి ఆర్డర్ దక్కించుకున్నారు. కానీ, సరఫరా చేయకుండానే రూ.కోట్లు కొల్లగొట్టారు. డైరెక్టర్ స్థాయి అధికారులతో కుమ్మక్కై, పశువుల దాణా తినేశారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ఓ లారీ గడ్డి సరఫరా చేశామంటూ లారీ నెంబరు ఇచ్చారు. విచిత్రం ఏమిటంటే ఆ లారీకి తగిలించిన నెంబరు ఓ ద్విచక్ర వాహనానిదిగా ఆర్టీఏ అధికారులు గుర్తించారు. అంతేకాదు ఫలానా రైతులకు గడ్డి సరఫరా చేశామంటూ వారి ఆధార్ నెంబర్లను కోడెల కంపెనీ సమర్పించింది. వాస్తవానికి వారెవరూ గడ్డిని తీసుకోలేదు. ఆధార్ డేటా నుంచి కొన్ని నెంబర్లు సేకరించి, ప్రభుత్వానికి సమర్పించినట్లు సమాచారం. పశువులకు కోడెల కంపెనీ సరఫరా చేసిన మందులు కూడా నాసిరకమైనవే. ఆ మందుల నాణ్యతను నిర్ధారించకుండా ఔషధ నియంత్రణ అధికారులను బెదిరించారు. పశు సంవర్థక శాఖలో కొందరు అధికారులు కోడెలకు సహకరించి, రూ.కోట్లు వెనకేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కోడెల, అతని కుమారుడిపై టీడీపీ నేత కేసు
నరసరావుపేట : మాజీ స్పీకర్ కోడెల, అతని కుమారుడు శివరామ్‌పై మరో కేసు నమోదైంది. తనను అపహరించటంతో పాటు బెదిరించి కాంట్రాక్ట్‌లో పర్సంటేజ్, అక్రమ వసూళ్లకు వీరిద్దరూ పాల్పడ్డారని టీడీపీ నాయకుడు, కాంట్రాక్టర్ వడ్లమూడి శివరామయ్య శనివారం గుంటూరు జిల్లా నరసరావుపేట స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రొంపిచర్ల మండలం వడ్లమూడివారిపాలెం గ్రామానికి చెందిన వడ్లమూడి శివరామయ్య కాంట్రాక్ట్ పనులు చేస్తుంటాడు. ఆర్‌డబ్ల్యూఎస్ చెరువు మరమ్మతులకు సంబంధించి 2016లో రూ.30 లక్షల కాంట్రాక్ట్ పనిని దక్కించుకున్నాడు. విషయం తెలుసుకున్న కోడెల శివరామ్ పిలిచి బెదిరించటంతో చేయాల్సిన పనిలో పది శాతం రూ.3 లక్షలు పర్సంటేజ్ (కే ట్యాక్స్) చెల్లించాడు. ఇది సరిపోలేదంటూ ఇంకా చెల్లించాలని కోడెల శివరామ్ నుంచి పిలుపు వచ్చింది.
శివరామయ్య వెళ్లకపోవటంతో శివరామ్ అనుచరులు గుత్తా నాగప్రసాద్, బద్దుల రాములు బలవంతంగా కారులో గుంటూరు హీరో షోరూమ్‌కు తీసుకెళ్లారు. అక్కడ బెదిరించి తాను అనారోగ్యంతో కాంట్రాక్ట్ పనులు చేయట్లేదంటూ సంతకాలు పెట్టించారని బాధితుడు తెలిపాడు. కాంట్రాక్ట్‌ను 6 నెలలపాటు బ్లాక్‌లిస్టులో చేర్చి కాంట్రాక్ట్‌ను బద్దుల రాములు దక్కించుకున్నాడని, దీంతో రూ.3 లక్షల నష్టం జరిగిందని శివరామయ్య ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పాటు మంచినీటి సరఫరా కాంట్రాక్ట్‌కు సంబంధించి మరో రూ.2 లక్షలు కోడెల శివరామ్ బెదిరించి తీసుకున్నాడని తెలిపారు. ఈ వ్యవహారంపై మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావును కలిసి చెప్పగా, నేనే అలా చేయమన్నానని కుమారుడికి వత్తాసు పలికాడన్నారు. తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బిలాలుద్దీన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment