
ప్రతీకాత్మక చిత్రం
కోల్‌కతా : వివాహ కార్యక్రమంలో పాల్గొని ఇంటికి వెళ్తున్న ఓ కుటుంబంపై దాడిచేసిన దుండగులు మహిళను ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. అయితే, కుటుంబ పెద్ద అప్రమత్తంగా వ్యవహరించి ఆమెను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కోల్‌కతాలోని టాంగ్రా ప్రాంతంలోని క్రిస్టోఫర్ రోడ్డులో జరిగింది. వివరాలు.. గోపాల్ ప్రమాణిక్ (55) తన కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం ఓ పెళ్లికి హాజరయ్యాడు. వేడుక పూర్తయ్యాక రాత్రి 11:45 గంటల సమయంలో వారంతా ఇంటికి తిరుగుపయనమయ్యారు. ఆయన కోడలు (28) మిగతా కుటుంబ సభ్యులు ముందు నడుస్తుండగా.. ప్రమాణిక్ వారిని అనుసరిస్తున్నాడు.
ఈక్రమంలో అంబులెన్స్‌లో దూసుకొచ్చిన కొందరు దుండగులు ప్రమాణిక్ కోడలిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. ఆమెను బలవంతంగా కారులో ఎక్కిస్తుండగా.. అప్రమత్తమైన ప్రమాణిక్ వాహనానికి అడ్డుగా నిలిచాడు. అంతలోనే కుటుంబసభ్యులు కూడా డ్రైవర్‌ను డోర్‌లో నుంచి పట్టుకున్నారు. దీంతో ఇక పట్టుబడ్డామని గ్రహించిన దుండగులు సదరు మహిళను వదిలేసి.. ఒక్కసారిగా కారును ముందుకు పోనిచ్చారు. ప్రమాణిక్‌ను ఢీకొట్టి పరారయ్యారు. తీవ్రగాయాలైన ప్రమాణిక్‌ను ఆస్పత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment