
ట్రాఫిక్ నియంత్రించే క్రమంలో.. వంతెనపై నుంచి కిందపడిన కానిస్టేబుల్ , చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి
తిమ్మాపూర్ (మానకొండూర్): కరీంనగర్‌లో ఓ లారీ మృత్యువై దూసుకొచ్చింది. ఆదివారం దైవ దర్శనం కోసం వెళ్తున్న దంపతుల కారును మానేరు వంతెనపై ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు వంతెన పైనుంచి కిందపడటంతో భర్త మృతిచెందగా.. భార్య తీవ్రంగా గాయపడింది. అదే సమయంలో ఘటనాస్థలంలో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు వచ్చిన కానిస్టేబుల్ కూడా అదుపు తప్పి వంతెనపై నుంచి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. కరీంనగర్ సుభాష్‌నగర్‌కు చెందిన గంటి శ్రీనివాస్, స్వరూప భార్యాభర్తలు.
శ్రీనివాస్ గంగాధర మండలం ఉప్పర మల్యాల ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో కొమురవెల్లి మల్లికార్జునస్వామి దర్శనం కోసం భార్యతో కలసి ఉదయం 9 గంటలకు కారులో ఇంటి నుంచి బయల్దేరారు. కారు మానేరు వంతెనపైకి చేరుకున్న సమయంలో కరీంనగర్ నుంచి వస్తున్న లారీ కారును వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. దీంతో కారు అదుపు తప్పి మానేరు వంతెన రెయిలింగ్‌ను ఢీకొని కిందపడింది. సుమారు 200 మీటర్ల ఎత్తు నుంచి కింద ఉన్న బండరాళ్లపై పడడంతో కారు నడుపుతున్న శ్రీనివాస్ (40) అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి భార్య స్వరూప తీవ్రంగా గాయపడింది.
స్థానికులు వెంటనే కరీంనగర్, ఎల్‌ఎండీ పోలీసులకు సమాచారం అందించారు. కరీంనగర్–1 టౌన్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ ప్రమాద స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను నియంత్రించే క్రమంలో అదుపుతప్పి వంతెన పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. 108లో స్వరూప, చంద్రశేఖర్‌ను కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చంద్రశేఖర్ మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని మంత్రి గంగుల కమలాకర్, సీపీ కమలాసన్‌రెడ్డి, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ క్రాంతి సందర్శించారు. ప్రమాదంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment