పోలీస్ స్టేషన్ ఆవరణలో దంపతులు
కర్ణాటక, కోలారు: పెళ్లయి సంతోషంగా గడపాల్సిన జంట వేధింపులతో ఆవేదన చెందుతోంది. కులాంతర ప్రేమ వివాహం చేసుకున్న ప్రేమికులు ఇంట్లో వారి వేధింపులు తాళలేక పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించిన ఘటన సోమవారం నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ ముందు కలకలం సృష్టించింది. కోలారు తాలూకా దండిగానహళ్లి గ్రామానికి చెందిన నవ దంపతులు హేమంత్‌కుమార్ (22), చైత్ర (20) తొమ్మిది నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. దీంతో రెండు కుటుంబాల మధ్య తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పెళ్లయిన కొత్తలో కొంతకాలం వేరే ఇంట్లో కాపురం ఉన్నారు. ప్రస్తుతం భార్య గర్భిణి కావడంతో హేమంత్‌కుమార్ తన ఇంటికి తీసుకు వచ్చాడు. అయితే ఇది ఇష్టం లేని హేమంత్‌కుమార్ కుటుంబం వారు చైత్రను వేధించడం మొదలుపెట్టారు.దీనిని భరించలేని దంపతులు సోమవారం నేరుగా రూరల్ స్టేషన్ వద్దకు వచ్చి తమ వద్ద తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పటించుకోవడానికి ప్రయత్నించారు. వెంటనే అక్కడ ఉన్న వారు అడ్డుకుని రక్షించడంతో ఘోరం తప్పింది.
అత్తమామలు వేధిస్తున్నారు : చైత్ర
చైత్ర మాట్లాడుతూ హేమంత్‌కుమార్ తండ్రి శ్రీనివాస్, తల్లి మునిరత్నమ్మ తమ్ముడు కార్తీక్‌లు తనను నిత్యం వేధిస్తున్నారని ఆరోపించారు. దీనిపై పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం కనిపించలేదని తెలిపారు. తనపై దాడి చేస్తున్నారని వాపోయింది. పోలీసులు తన అత్తమామ, మరిదిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కోలారు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment