
ఆత్మహత్య చేసుకున్న నవీన్
ఇరగవరం : ప్రేయసి ఫోన్‌లో మాట్లాడలేదని క్షణికావేశంలో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం శివారు గొల్లమాలపల్లిలో మంగళవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇరగవరం మండలం కె.ఇల్లిందలపర్రుకు చెందిన వింజేటి తాతారావు చిన్న కుమారుడు నవీన్ (21), గొల్లమాలపల్లికి చెందిన యువతి కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. యువతి తల్లి ఉపాధి నిమిత్తం గల్ఫ్‌లో ఉంటోంది. యువతి నవీన్‌కు వరుసకు అక్క కూతురు కావడంతో పెద్దలు కూడా వీరికి పెళ్లి చేయాలని నిశ్చయించారు.
ఇటీవల యువతి తల్లి సొంతంగా గ్రామంలో భవన నిర్మాణం చేపట్టడంతో ఆ పనులను నవీన్ దగ్గరుండి చేయిస్తున్నాడు. అయితే సోమవారం రాత్రి నవీన్ యువతికి ఫోన్ చేయగా ఆమె ఫోన్ ఎత్తకపోవడంతో ఉద్రేకంగా గొల్లమాలపల్లిలోని యువతి ఇంటికి వచ్చి ఫోన్ ఎందుకు ఎత్తలేదని నిలదీస్తూ తాను ఉరేసుకుంటానని బెదిరించాడు. భయంతో యువతి బంధువులను పిలుచుకొచ్చేసరికే నవీన్ చున్నీతో ఉరివేసుకుని మరణించాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment