
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వాసుదేవ్, రూప
ఇచ్ఛాపురం రూరల్: ప్రియురాలిపై ప్రియుడు దాడిచేశాడు. ప్రియురాలు ప్రతిఘటించి ప్రియుడి చేయి కరచి వెళ్లిపోయింది. ఈ సంఘటనపై ఇచ్ఛాపురం రూరల్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం కేసులు నమోదయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలో అరకబద్ర గ్రామానికి చెందిన జవాన్ రంగాల వాసుదేవ్ అదే గ్రామానికి చెందిన కొయ్య రూప గత కొంత కాలంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామన్న దశలో వాసుదేవ్ తల్లిదండ్రులు అడ్డుచెప్పడంతో ప్రేమ కాస్తా వివాదంగా మారింది. ఈ మేరకు ప్రియుడు వాసుదేవ్‌పై ప్రియురాలు రూప గత ఏడాది నవంబర్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వాసుదేవ్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు.
ఇదిలావుండగా మంగళవారం రూప గ్రామంలోని కొత్త చెరువులో స్నానం చేసి ఇంటికి వస్తుండగా, ప్రియుడు వాసుదేవ్‌తో పాటు అన ్నయ్య రంగాల భోగేష్, మేనమామ మంగి బాబురావు అడ్డగించి చేయి పట్టుకున్నారు. కేసు ఉపసంహరించుకోవాలని బెదిరించడంతో ఆమె వారిని ప్రతిఘటించింది. ఈ తరుణంలో రూప మోచేతికి గాయం కాగా, వారి నుంచి తప్పించుకోవాలన్న భయంతో ప్రియుడు వాసుదేవ్ మణికట్టు వద్ద రూప నోటితో కొరికి ఇంటికి పారిపోయింది. తన చేతిని కరిచి గాయం చేసిందంటూ వాసుదేవ్ రూపపై ఫిర్యాదు చేయగా, తనపై దాడికి పాల్పడి గాయం చేశారంటూ రూప ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇరువురిపై కేసు నమోదు చేసిన ఎస్సై కె.కోటేశ్వరరావు చికిత్స నిమిత్తం ఇద్దరినీ స్థానిక సామాజిక ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment