మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడే వారి వెన్నులో వణుకు పుట్టించే వార్త. మధ్యప్రదేశ్‌లో ఓ రేప్ కేసు దోషికి కోర్టు మరణ శిక్ష విధించింది. కేవలం 46 రోజుల్లోనే కేసులో నిందితుడికి శిక్ష పడటం గమనార్హం.
భోపాల్ : 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడే వారికి మరణ శిక్ష విధించాలంటూ గతేడాది డిసెంబరులో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏకగ్రీవంగా బిల్లును పాస్ చేసింది. ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదించడంతో ఏప్రిల్ 21న చట్టం రూపం దాల్చింది. ఇదిలా ఉంటే రెహిల్ జిల్లా ఖమారియా గ్రామంలో ఓ ఆలయంలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. మే 21న పటేల్ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. తాజాగా నిందితుడిని దోషిగా తేల్చిన సాగర్ జిల్లా కోర్టు అతడికి మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. అంతేకాదు త్వరగతిన శిక్షను అమలు చేయాలని పోలీస్ శాఖను కోర్టు ఆదేశించింది. మధ్యప్రదేశ్‌లో చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దోషికి ఉరిశిక్ష పడడం ఇదే తొలిసారి.
కోర్టు తీర్పుపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు నేరగాళ్లకు చెంపపెట్టు అవుతుందని, మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడేవారు శిక్ష నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు. హోమంత్రి భూపేంద్ర సింగ్ మాట్లాడుతూ ఇదో చారిత్రాత్మక తీర్పుగా అభివర్ణించారు. ఇకపై అత్యాచారాలకు పాల్పడే వారికి వెన్నులో వణుకుపుట్టాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment