
బ్రిడ్జి మీద నుంచి దూకుతున్న నరేందర్‌గౌడ్ (సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యం) ,నరేందర్‌గౌడ్ (ఫైల్)
నాగోలు: ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఫ్లై ఓవర్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు..రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోయపల్లికి చెందిన పొలగోని నరేందర్‌గౌడ్ (37) వనస్థలిపురం సాగర్ కాంప్లెక్స్‌లో భార్య పార్వతమ్మ, కుమారుడు శ్రీకర్(4)తో కలసి ఉంటున్నాడు. నగరంలో ఉంటు కారు డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొంత కాలంగా నరేందర్ ఆర్థిక ఇబ్బందులతో బాధపడటమే కాకుండా కుటుంబ కలహాలతో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
తన చావుకుఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలే కారణమని సూసైడ్ నోట్ రాసి ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్ కు సమీపంలోనే ఉన్న ఎల్‌బీనగర్ ఫ్లైఓవర్ పైకి తన బైక్ పై చేరుకున్నాడు. బైక్‌ను అక్కడే వదిలి పైనుంచి దూకాడు. ఈ సంఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డటంతో స్థానికులు 108 అంబులెన్స్‌లో ఓ ప్రయివేట్ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. నరేందర్ తండ్రి మల్లయ్య మాత్రం తన కుమారుడి చావుకు కారణం తన కోడలు పార్వతమ్మతో పాటు తన బంధువైన రమేష్ కారణమని, వారి వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. నరేందర్ జేబులో ఓ రెండు సూసైడ్ నోట్లు దొరికాయి. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు.