పబ్‌ నుంచి బయటకు వెళ్లమన్నందుకు.. | man committed suicide attempt | Sakshi
Sakshi News home page

పబ్‌ నుంచి బయటకు వెళ్లమన్నందుకు..

Published Sun, Dec 31 2017 2:52 AM | Last Updated on Sun, Dec 31 2017 7:23 AM

man committed suicide attempt - Sakshi

హైదరాబాద్‌: అర్ధరాత్రి తర్వాత పబ్‌కు వెళ్లి మద్యం కావాలంటూ హంగామా చేయడంతోపాటు బౌన్సర్లు అడ్డుకోవడంతో ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసు కుంది. నిజామాబాద్‌కు చెందిన సందీప్‌ వర్మ(35) అదే ప్రాంతానికి చెందిన రాజేందర్, శాలిబండలో నివాసముండే జావెద్, కైసర్‌ స్నేహితులు. వీరంతా సందీప్‌ వర్మ కారులో శుక్రవారం అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో సోమాజిగూడ పార్క్‌ హోటల్‌లోని అక్వాపబ్‌కు వెళ్లి మద్యం ఆర్డర్‌ ఇచ్చారు.

సమయం మించిపోయిందని వెయిటర్‌ చెప్పడంతో గొడవకు దిగారు. దీంతో బౌన్సర్లు వీరిని పబ్‌ బయటకు లాక్కొచ్చారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న సందీప్‌వర్మ తన కారులో జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వద్దనున్న పెట్రోల్‌బంక్‌కు వెళ్లాడు. 4 లీటర్ల పెట్రోల్‌ కొనుగోలు చేసి పబ్‌కు వచ్చాడు. గేటు వద్దే బౌన్సర్లు అడ్డుకోవడంతో పెట్రోల్‌ను తనతోపాటు బౌన్సర్‌ మన్సూర్‌పై పోశాడు. ఆ వెంటనే నిప్పంటించుకోవడంతో హోటల్‌ సిబ్బంది అప్రమత్తమై సందీప్‌ను యశోద హాస్పిటల్‌కు, బౌన్సర్‌ను దక్కన్‌ హాస్పిటల్‌కు తరలించారు.

సందీప్‌ వర్మ 60 శాతం కాలిన గాయాలతో, బౌన్సర్‌ స్వల్పగాయాలతో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. సందీప్‌ స్నేహితులు రాజేందర్, జావెద్‌ను పంజగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కైసర్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి వరకు పబ్‌లను తెరిచి ఉండటం, గొడవ జరుగుతున్న సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజామున 3 గంటల వరకు జరిగిన సంఘటనను వెలుగులోకి రాకుండా ఉండేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement