
రాజయ్య మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్సై రాజన్‌బాబు
కరీమాబాద్ : నగరంలోని రంగశాయిపేట కాపువాడలో ఓ హమాలీ కార్మికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. మృతుడి కూతురు స్వర్ణలత, భార్య రమలతో పాటు మిల్స్‌కాలనీ ఎస్సై రాజన్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. రంగశాయిపేట కాపువాడలో ఉంటున్న హమాలీ కార్మికుడు మద్ది రాజయ్య(53) ఇంటి పక్కనే ఉన్న మోసం శ్రీలత, నాగరాజు తమ ఇంటి పక్కనే ఉన్న స్థలాన్ని రాజయ్యకు 2008 అమ్మారని, కాగా, ఆ స్థలాన్ని రాజయ్య తన అల్లుడు కొండ కుమార్‌కు ఇవ్వగా అతను ఇందిరమ్మ పథకం కింద ఇల్లు కట్టుకుని రాజయ్యతో పాటు అతని భార్య రమలను అందులోనే ఉంచి తాను హైదరాబాద్‌లో ఉంటున్నాడని వివరించారు.
ఈ క్రమంలో ఆ స్థలం అసలు రాజయ్యకు తాము అమ్మలేదని, ఆ స్థలం తమదేనని ఇంటిపక్కనే ఉన్న మోసం శ్రీలత, నాగరాజు తరుచూ రాజయ్యను వేధిస్తుండడంతో పాటు పలుమార్లు పెద్ద మనుషుల మద్య, మిల్స్‌కాలనీ పోలీస్టేషన్ వద్ద కూడా పంచాయతీ నిర్వహించినా ఫలితం లేకపోవడంతో మనస్తాపానికి గురైన రాజయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన కుటుంబసభ్యులు, బంధువులు తెలిపారు.
ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా రాజయ్య మృతికి కారణమైన మోసం శ్రీలత, నాగరాజుల ఇంటిముందు కొద్దిసేపు నిరసన తెలిపి తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కార్పొరేటర్ కేడల పద్మాజనార్ధన్, నాయకులు కొప్పుల శ్రీనివాస్, కొంతం మోహన్ తదితరులు సంఘటనా స్థలానికి వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మిల్స్‌కాలనీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.