
సాక్షి, నార్పల(అనంతపురం) : ఆస్తి కోసం తమ్ముడిని కడతేర్చిన అన్న ఉదంతం నార్పలలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన మేరకు... గారబావి కొట్టాల కాలనీకి చెందిన చిన్న నాగమునికి బండి రాజు, బండి నాగార్జున (30) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి మధ్య కొంత కాలంగా తండ్రికి చెందిన 12 సెంట్ల స్థలానికి సంబంధించి వివాదం నడుస్తోంది. మంగళవారం పెద్దల సమక్షంలో అన్నదమ్ముల స్థల వివాదం పంచాయితీ జరగాల్సి ఉండగా అది వాయిదా పడింది. తమ్ముడు బండి నాగార్జునను అంతమొందిస్తే ఆస్తి మొత్తం తనకే దక్కుతుందని బండి రాజు భావించాడు.
మంగళవారం అర్ధరాత్రి నాగార్జున, నాగరత్న దంపతులు ఆరుబయట పడుకుని ఉండటాన్ని రాజు గమనించాడు. ఇదే అదునుగా భావించి ఇనుపరాడ్‌తో తమ్ముడు నాగార్జునపై దాడి చేశాడు. తలకు బలమైన గాయమై నాగార్జున అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య నాగరత్న ఫిర్యాదు మేరకు సీఐ విజయభాస్కర్‌గౌడ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నిందితుడు రాజును అదుపులోకి తీసుకున్నాడు. నాగరాజుకు నాలుగు నెలల కిందటే వివాహమైంది. భర్త మృతితో నాగరత్న బోరున విలపించింది.