
నేలకొండపల్లి : ఓ యువకుడు తన భార్యను చంపాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టుకు అప్పగించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఖమ్మం రూరల్ ఏసీపీ పింగలి నరేష్‌రెడ్డి తెలిపిన వివరాలు...
నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం గ్రామస్తురాలైన ఆమె పేరు మాతంగి నవీన. నేలకొండపల్లిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం వెనుక భాగంలో ఈ నెల 16న విగతురాలిగా కనిపించింది. ఆమె భర్త మాతంగి గంగాధర్‌రావు కూడా అక్కడే విషపు గుళికలు మింగి ఆత్మహత్యకు యత్నించాడు. సమాచారమందుకున్న వెంటనే అక్కడకు నేలకొండపల్లి ఎస్సై కొణతం సుమన్ వెళ్లారు.
మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె గొంతు నల్లగా కమిలి ఉంది. పక్కనే ఆమె చున్నీ, గుళికల మందు కనిపించాయి. ఆమెది హత్యగా భావించారు. కేసు నమోదు చేశారు. నవీన తల్లి కొండమీది రాణి ఫిర్యాదుతో కూసుమంచి సీఐ జె.వసంతకుమార్ దర్యాప్తు చేపట్టారు. గుళికలు మింగిన ఆమె భర్త గంగాధర్‌రావును ఆస్పత్రిలో చేర్పించారు. అతడు కోలుకున్నాక అరెస్ట్ చేసి విచారించారు. ఆ రోజున ఏం జరిగిందే అతడు పూసగుచ్చినట్టుగా వివరించాడు.
16వ తేదీన ఏం జరిగింది...?
తనను భార్య నవీన దారుణంగా మోసగిస్తున్నదని గంగాధర్‌రావులో కొన్నాళ్ల క్రితం అనుమానపు బీజం పడింది. తన అనుమానం నిజమేనని ఒక రోజున నిర్థారించుకున్నాడు. ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా సరే.. ఆమెను చంపాలనుకున్నాడు. పథకం వేశాడు. అప్పటికే వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఇద్దరం కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్దామని అతడు తన భార్యతో చెప్పాడు. ఆమె నమ్మింది. సరేనంది. ఇద్దరూ కలిసి ఈ నెల 16న నేలకొండపల్లి వచ్చారు. అక్కడ అతడు.. ‘‘మన పరువు పోయింది. మనమిద్దరం కలిసి చచ్చిపోదాం’’ అంటూ ఆమెను శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం వెనుక భాగంలోని నిర్జన ప్రదేశానికి బలవంతంగా తీసుకెళ్లాడు.
అప్పటికే అతడు తనతోపాటు కొన్ని విషపు గుళికలు తెచ్చుకున్నాడు. అక్కడ ఆమె గొంతును చున్నీతో బిగించి చంపాడు. ‘‘తామిద్దరిదీ ఆత్మహత్య’’ అని, పోలీసులను నమ్మించేందుకుగాను తాను కూడా విషపు గుళికలు నోట్లో వేసుకున్నాడు. అక్కడే పడిపోయాడు. పోలీసులు వచ్చారు. మృతదేహాన్ని మార్చురీకి, గంగాధర్‌రావును ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడు కోలుకున్నాక పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. ఆమెను ఎందుకు చంపిందీ, అసలేం జరిగిందీ వివరించాడు.
రాళ్లు పడ్డాయి... ప్రాణం తీశాడు..
గువ్వలగూడెం పక్కనున్న గోకినేపల్లి గ్రామానికి చెందిన దేవపంగు ఉపేందర్‌తో నవీనకు వివాహేతర సంబంధం ఉన్నదని గంగాధర్‌రావుకు అనుమానం. ఇదే విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. గతంలో పెద్దలు పంచాయితీ చేశారు. తాను అప్పుడప్పుడు నవీనను కలుస్తున్నట్టుగా ఆ పంచాయితీలో ఉపేందర్ ఒప్పుకున్నాడు. ఇక నుంచి ఆమెను ఎప్పటీకీ కలవనని పెద్ద మనుషులతో చెప్పాడు. ఈ నెల 12వ తేదీ రాత్రి సమయం. గంగాధర్‌రావు–నవీన దంపతులు, పిల్లలు తమ ఇంట్లో నిద్రిస్తున్నారు.
ఆ రాత్రి వేళ, కిటికీలో నుంచి లోపలికి చిన్న చిన్న గులక రాళ్లను ఎవరో విసిరేశారు. నవీన మేల్కొంది. కిటికీ అవతలి వైపున ఉపేందర్. ఆమెకు సైగలు చేస్తున్నాడు. అప్పటికే మేల్కొన్న గంగాధర్‌రావు.. నిద్రిస్తున్నట్టుగా నటిస్తూ ఇదంతా గమనించాడు. తట్టుకోలేకపోయాడు.. ఆగలేకపోయాడు. భార్యతో తీవ్రంగా గొడవపడుతున్నాడు. బయటి నుంచి రాళ్లు వేసిన ఉపేందర్.. చీకటిలో కనుమరుగయ్యాడు. గంగాధర్‌రావు అప్పుడే నిర్ణయించుకున్నాడు... తనను మోసగించిన భార్యను ఎలాగైనా చంపాలని..! ఆ తరువాత పథకం వేశాడు.. మూడు రోజుల తరువాత (ఈ నెల 16న) ఆమెను చంపేశాడు.
కేసు నమోదు.. ఇద్దరి అరెస్ట్
నవీనను చంపిన గంగాధర్‌రావుపై, దీనికి కారకుడైన దేవపంగు ఉపేందర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. గంగాధర్‌రావును అరెస్ట్ చేసి కోర్టుకు అప్పగిం చారు. ఉపేందర్‌ను ముందుగానే అరెస్ట్ చేశారు. సమావేశంలో కూసుమంచి సీఐ వసంత కుమార్, నేలకొండపల్లి ఎస్సై కొణతం సుమన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment