
ప్రమాద స్థలంలో మృతదేహాలు
సత్తుపల్లిరూరల్ : లారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. బైక్‌పై వెళుతున్న యువ దంపతులను బలిగొంది. సత్తుపల్లి మండలం మేడిశెట్టివారిపాలెం వద్ద సోమవారం మధ్యాహ్నం ఇది జరిగింది. దమ్మపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన దంపతులు వాడపల్లి గాంధీ(28), వెంకటేశ్వరమ్మ(23), తమ పిల్లలు నాలుగేళ్ల మనీషా, మూడేళ్ల మానసతో కలిసి బైక్‌పై సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి బయల్దేరారు.
అక్కడ చికిత్స పొందుతున్న తమ బంధువులను పరామర్శించాలనుకున్నారు. మార్గమధ్యలోగల మేడి శెట్టివారిపాలెం సమీపంలోకి రాగానే, ఎదురుగా అశ్వారావుపేట వైపు వేగంగా వెళ్తున్న లారీ.. వీరి బైక్‌ను ఢీకొని ఆగకుండా వెళ్లింది. ఈ ప్రమాదంలో వాడపల్లి గాంధీ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వరమ్మ.. 108 వాహనంలో సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలొదిలింది.
బైక్‌పై ఉన్న చిన్న కుమార్తె మానస.. ఎగిరి, పక్కనున్న చెత్తపై పడిపోయింది. ప్రాణాపాయాన్ని తప్పించుకుంది. పెద్ద కుమార్తె మనీషా తలకు తీవ్ర గాయాలయ్యాయి. సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రమాద స్థలాన్ని సత్తుపల్లి సీఐ ఎం.వెంకటనర్సయ్య పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మొద్దులగూడెంలో విషాదం
దమ్మపేట: మండలంలోని మొద్దులగూడెం గ్రామానికి చెందిన దంపతులు వాడపల్లి గాంధీ(యాకోబు), వెంకటేశ్వరమ్మ మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎస్సీ కాలనీలో విషాదం నెలకొంది. అప్పటివరకు తమ కళ్లెదుటే తిరిగిన దంపతులు.. అంతలోనే కానరాని లోకాలకు వెళ్లారన్న వార్తను మొద్దులగూడెం గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు.
విగతులుగా మారిన అమ్మా,నాన్నను చూసి ఆ ఇద్దరు చిన్నారులు రోదిస్తుండడంతో చూపరులు కంట తడి పెట్టారు. అనాథలుగా మారిన ఆ చిన్నారులకు నాయనమ్మ, తాతయ్యే పెద్ద దిక్కయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment