సాక్షి ప్రతినిధి, చెన్నై: అతనో కామాంధుడు. సభ్యత, సంస్కారం లేదు. వావి వరసలు అంతకంటే లేవు. తనలోని కామతృష్ణ తీర్చుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకున్నాడు. యువతులు, వివాహితులపై ప్రయోగించి అంతరంగిక సంభాషణలు, ఫొటోలు, వీడియో దృశ్యాలు వారికి తెలియకుండానే తస్కరించాడు. వాటిని చూపి బెదిరించి లొంగదీసుకున్నాడు. వీడియో తీసి విదేశీ పోర్న్‌సైట్‌లకు అమ్మి సొమ్ము చేసుకున్నాడు. స్వయానా సోదరి సహా 80 మంది యువతుల దృశ్యాలను తిలకిస్తూ ఆనందించాడు. దినేష్‌కుమార్ అనే సైబర్ సెక్స్ సైకోను తమిళనాడు పోలీసులు సినీఫక్కీలో వలవేసి అరెస్ట్ చేశారు.
వివరాలు.. తమిళనాడు, రామనాథపురం జిల్లా పరైక్కుళం సమీపం తామరైకుళంకు చెందిన దినేష్‌కుమార్ ఎంసీఏ పట్టభద్రుడు. బంధుమిత్రుల ఇళ్లలోని సోదరీమణులు, వివాహితలు, యువతులతో మంచిగా మాట్లాడుతూ స్మార్ట్‌ఫోన్ చూసిస్తానని తీసుకుంటాడు. ఫోన్లలోని ఫొటో గ్యాలరీల్లో భర్త లేదా బాయ్‌ఫ్రెండ్‌కు పంపిన అర్ధనగ్న దృశ్యాలు, వీడియోలు ఉంటే తన ఫోన్‌కు పంపించుకుంటాడు. ఫోన్‌లో సరికొత్త యాప్‌లను డౌన్‌లోడ్ చేసిస్తానని మభ్యపెట్టి వారికి తెలియకుండా ఓ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి తన ఫోన్‌తో అనుసంధానం చేస్తాడు. ట్రాక్ వ్యూ వల్ల ఆయా మహిళలు జరిపే సంభాషణలు, పంపుతున్న ఫొటోలు, వీడియోలు తన సెల్‌ఫోన్ ద్వారా వీక్షిస్తాడు. ఆయా అంశాలను తన ల్యాప్‌టాప్‌లో నిక్షిప్తం చేస్తాడు. తానెవరో చెప్పకుండా సదరు మహిళలకు ఫోన్ చేసి తన లైంగిక కోర్కెలు తీర్చాలని, లేకుంటే వాటిని ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరించి వారిని లొంగదీసుకునేవాడు.
ఈ క్రమంలో ఒక బాధితురాలు విషయాన్ని తన సోదరికి చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకుంది. సోదరి సలహామేరకు దినేష్‌కుమార్‌కు ఫోన్ చేసి పలానా చోటకు రావాలని కోరింది. దినేష్‌కుమార్ అక్కడికి రాగానే అతన్ని చూసిన బాధిత మహిళ, ఆమె సోదరుడు, బంధువులు బిత్తరపోయారు. వరసకు తమ్ముడైన వ్యక్తే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుసుకుని దేహశుద్ధి చేసి దేవీపట్నం పోలీసులకు అప్పగించారు. దినేష్‌కుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతని ఇంటికి వెళ్లి తనిఖీలు చేపట్టి రెండు ల్యాప్‌టాప్‌లు, మూడు సెల్‌ఫోన్లు, మహిళలు ధరించే దుస్తులు స్వాధీనం చేసుకున్నారు.
తనకు లొంగిన మహిళల దుస్తులను సేకరించి దినేష్ ఇంట్లో భద్రపరుచుకున్నట్టు తెలిసింది. లొంగని మహిళల ఫొటోలు, దృశ్యాలను విదేశీ పోర్న్‌సైట్‌లకు అమ్మి సొమ్ము చేసుకున్నాడు. అంతరంగిక విషయాలను గుట్టురట్టు చేస్తానంటూ వాట్సాప్ కాల్‌తో విదేశాల నుంచి మాట్లాడుతున్నట్లు వ్యవహరించడంతో ఎవరు మాట్లాడుతున్నారో తెలియక ఎందరో బాధిత మహిళలు భయంతో తల్లడిల్లిపోయారు. దినేష్‌కుమార్ నుంచి స్వాధీనం చేసుకున్న రెండు ల్యాప్‌టాప్‌లలో 80 మంది వివాహితలు, యువతుల అంతరంగిక వివరాలను పోలీసులు గుర్తించారు. అంతేగాక తోడబుట్టిన సోదరి తన భర్తతో మాట్లాడిన అంతరంగిక సంభాషణలు, భర్తతో గడిపిన ఫొటోలు, వీడియో దృశ్యాలను సైతం ల్యాప్‌టాప్‌లో నిక్షిప్తం చేసుకుని ఉన్నాడు. నిందితుడిపై సమాచార వ్యవస్థ దుర్వినియోగం, మహిళలపై వేధింపులు వంటి కేసులు నమోదు చేసి దేవీపట్నం పోలీసులు బుధవారం అతన్ని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment