పెంపుడు కుక్కకు సారీ చెప్పలేదని.. | Man stabbed to death for refusing to say sorry to dog | Sakshi
Sakshi News home page

పెంపుడు కుక్కకు సారీ చెప్పలేదని..

Published Mon, Oct 8 2018 4:24 AM | Last Updated on Mon, Oct 8 2018 4:24 AM

Man stabbed to death for refusing to say sorry to dog - Sakshi

న్యూఢిల్లీ: దేశరాజధానిలో దారుణం చోటుచేసుకుంది. తమ పెంపుడు కుక్కకు సారీ చెప్పనందుకు ముగ్గురు దుండగులు ఓ మినీ ట్రక్కు డ్రైవర్‌ను కత్తులు, స్క్రూ డ్రైవర్‌తో విచక్షణారహితంగా పొడిచి చంపారు. ఢిల్లీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న విజేందర్‌ రాణా(45) శుక్రవారం అర్ధరాత్రి తన వాహనంలో ఇంటికి బయలుదేరాడు. ఇక్కడి ఉత్తమ్‌ నగర్‌లోని మోహన్‌ గార్డెన్‌ ప్రాంతంలో అంకిత్, అతని సోదరుడు పరస్, స్నేహితుడు దేవ్‌ చోప్రాలు తమ కుక్క టామీతో కలిసి షికారుకు వచ్చారు. శునకాన్ని రోడ్డుకు ఓవైపు వదిలేసి మరోవైపు వీరు మాట్లాడుకుంటున్నారు. ఇంతలో అటుగా వచ్చిన విజేందర్‌ ట్రక్కును చూసిన టామీ గట్టిగా అరిచింది. దీంతో వాహనాన్ని బలవంతంగా ఆపిన ముగ్గురు దుండగులు విజేందర్‌ను జుట్టుపట్టుకుని కిందకు లాగారు.

తమ కుక్క టామీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అయితే తనతో గొడవ పడకుండా కుక్కను జాగ్రత్తగా చూసుకోమని విజేందర్‌ ముందుకు కదిలాడు. కొద్దిదూరం వెళ్లగానే బాధితుడి వాహనాన్ని అడ్డగించిన ముగ్గురు దుండగులు కత్తులు, స్క్రూడ్రైవర్‌తో అతడిని ఆరుసార్లు పొడిచారు. విజేందర్‌ ఆర్తనాదాలు విని కాపాడేందుకు పరిగెత్తుకుంటూ ఇంటి నుంచి బయటకు వచ్చిన సోదరుడు రాజేశ్‌కు మూడు కత్తిపోట్లు పడ్డాయి. వీరిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా విజేందర్‌ మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. కొన ప్రాణాలతో కొట్టిమిట్టాడుతున్న రాజేశ్‌ను మెరుగైన చికిత్స కోసం దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించారు. కాగా పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement