నిందితులు పారిపోతున్న దృశ్యం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దారుణం చోటు చేసుకుంది. బైక్‌లపై వచ్చిన పోకిరీలు రెచ్చిపోయారు. ఓ యువకుడిపై నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు. కత్తులతో, రాడ్లతో అతనిపై విరుచుకుపడటంతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తమయ్యింది.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ఖాన్‌పూర్‌కు చెందిన అశిశ్ అనే యువకుడు గురువారం సాయంత్రం జిమ్ నుంచి బయటకు వచ్చాడు. అంతలో సుమారు 10 బైక్‌లు అక్కడికి దూసుకొచ్చాయి. వాటిపై వచ్చిన 20 మంది యువకులు అశిశ్‌పై కత్తులతో, రాడ్లతో దాడి చేశారు. అంత మంది ఒకేసారి అతనిపై దాడి చేసే సరికి ప్రతిఘటించలేకపోయాడు. స్థానికులు కూడా ముందుకు వచ్చే ధైర్యం చేయలేకపోయారు.
దాడి అనంతరం అంతే వేగంగా వారు అక్కడి నుంచి పరారయ్యారు. ఆపై స్థానికులు అశిశ్‌ను ఆస్పత్రికి తరలించారు. ఆ యువకుడికి 50 కత్తిపోట్లు తగిలాయని.. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ దాడితో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.
పిల్లాడిని కాపాడినందుకే...
అంతకు ముందు ఉదయం హోలీ వేడుకల్లో స్థానికంగా ఓ చిన్న ఘర్షణ నెలకొంది. ఓ బాలుడు రంగుల బెలూన్లను ఇద్దరు వ్యక్తులపై పొరపాటున విసిరాడు. దీంతో వారు ఆ బాలుడిని చితకబాదగా.. అశిశ్ జోక్యం చేసుకుని బాలుడిని రక్షించాడు. వెళ్లేముందు అంతు చూస్తామని వారు అశిశ్‌ను బెదిరించినట్లు స్థానికులు చెబుతున్నారు. బహుశా ఇది వారిపనే అయి ఉంటుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment