
ధ్వంసమైన ఎల్‌ఈడీ టీవీ పోలీసులు అదుపులోకి తీసుకున్న ముక్తేశ్వరరావు
గుంటూరు ఈస్ట్: ఆత్మహత్యాయత్నం చేసి జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి ఉన్మాద స్థితిలో 103 వార్డులోని వైద్యుల గదిలో వస్తువులను ధ్వంసం చేసిన ఘటన శుక్రవారం రాత్రి కలకలం రేపింది. కొత్తపేట ఎస్‌హెచ్‌ఓ మధుసూదనరావు తెలిపిన వివరాలప్రకారం నంబూరులోని విజయభాస్కర్ కాలనీకిచెందిన దేవరకొండ ముక్తేశ్వరరావు అనే వ్యక్తి మద్యానికి బానిస అయ్యాడు.మద్యం మత్తులో ఈ నెల 10వ తేదీ విష గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
కుటుంబ సభ్యులు అతనిని జీజీహెచ్‌లో చేర్పించగా 103 వ వార్డులో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం రాత్రి వార్డులో నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. సెక్యూరిటీ గార్డులు అతనిని అడ్డుకున్నారు. ముక్తేశ్వరరావు వారితో ఘర్షణపడి వేగంగా 103 వ వార్డులోకి ప్రవేశించాడు. వైద్యులు ఉండే గదిలోకి వెళ్లి సెలైన్ రాడ్ తీసుకుని ఎల్‌ఈడీ టీవీ, కంప్యూటర్, సీలింగ్‌లను ధ్వంసం చేశాడు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది చాకచక్యంగా అతనిని పట్టుకున్నారు. కొత్తపేట ఎస్‌హెచ్‌ఓ మధుసూదనరావు, సిబ్బంది ముక్తేశ్వరరావును అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.