
పోలీసుల అదుపులో నిందితులు
టెక్కలి రూరల్/మెళియాపుట్టి: విశాఖ నుంచి ఇచ్ఛాపురం గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు సినీఫక్కీలో పట్టుకున్నారు. నర్సిపురానికి చెందిన హరీష్, నాతవరానికి చెందిన సురేష్ పర్లాకిమిడి వైపు నుంచి ఫోర్డు కారులో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నారన్న సమాచారం మేరకు మెళియాపుట్టి పోలీసులు నిఘా పెట్టారు.
మెళియాపుట్టి, చాపర వద్ద ఆటోలను అడ్డంగా ఉంచారు. అయితే మెళియాపుట్టి వద్ద వేగంగా వచ్చిన సదరు కారు ఒక్కసారిగా ఆగినట్టుగా ఆగి వెంటనే ముందుకు దూసుకుపోయింది. ఈ సమయంలో కారును అడ్డుకునేందుకు ఉన్న ఇద్దరు ఆటో డ్రైవర్లు క్షణంలో ప్రమాదం నుంచి తప్పించుకొన్నారు.
స్థానిక ఎస్‌ఐ రాజేష్ బైక్‌పై కారును వెంబడించిన ఫలితం లేకపోయిది. వెంటనే ఆయన టెక్కలి పోలీసులకు సమాచారం అందించారు. సదరు నిందితులు గొప్పిలి మీదుగా మెళియాపుట్టి చేరుకొని అక్కడి నుంచి టెక్కలి వచ్చే ప్రయత్నంలో కారులో ఉన్న సుమారు 120 కిలోల గంజాయిని మెళియాపుట్టి మండలం మారడికోట గ్రామ సమీపంలోని పొదల్లో దాచిపెట్టారు.
తిరిగి టెక్కలి వైపు వస్తుండగా మార్గమధ్యంలో కారు మరమ్మతుకు గురికావడంతో అక్కడే విడిచిపెట్టి ఆటోలో టెక్కలి చేరుకున్నారు. స్థానిక వైఎస్‌ఆర్ కూడలి వద్ద ఉన్న సమయంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని చూసి పారిపోయేందుకు ప్రయత్నంలో చెరువులోకి దూకారు.
వెంటనే పోలీసులు వారిని వెంబడించి విచారించగా గంజాయి రవాణా విషయం వెలుగుచూసిందని టెక్కలి ఎస్‌ఐ బి.సురేష్‌బాబు తెలిపారు. పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.