సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత జితేంద్ర (రవి కపూర్) తనను లైంగికంగా వేధించాడంటూ ఆయన మేనకోడలు ఆరోపించారు. లైంగిక వేధింపుల ఘటనను వివరిస్తూ హిమాచల్ ప్రదేశ్ డీజీపీ కార్యాలయానికి బాధితురాలు ఫిర్యాదు లేఖ రాశారు. కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా ఆమె కోరినట్లు సమాచారం. లైంగిక వేధింపులకు గురైన వారు ధైర్యంగా బయటకు వచ్చి జరిగిన అన్యాయంపై పోరాడటం, బాధితులకు అండగా నిలిచేందుకు చేపట్టిన మీటూ ఉద్యమం (#MeToo campaign) వల్లే తాను 47 ఏళ్ల కిందట ఎదుర్కొన్న లైంగిక దాడిపై ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు చెబుతున్నారు.
హోటల్ గదికి తాగొచ్చాడు..
'1971లో జితేంద్ర సిమ్లా లోకేషన్లలో షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. అప్పుడు ఆయనకు 28 ఏళ్లు కాగా, నాకు 18 ఏళ్లు. అన్ని సిద్ధం చేశానని, షూటింగ్ చూసేందుకు రావాలని జితేంద్ర కోరగా.. నేను ఢిల్లీ నుంచి సిమ్లాకు వెళ్లాను. హోటల్ రూములో నా కోసం రూమ్ బుక్ చేశాడు. షూటింగ్‌లో పాల్గొన్న ఆయన రాత్రి హోటల్‌లో నా గదికి వచ్చారు. చాలా అలసిపోయాననని, ఇక్కడే విశ్రాంతి తీసుకుంటానని చెప్పాడు. మధ్యరాత్రి లేచి చూసేసరికి జితేంద్ర తన బెడ్‌ను నా బెడ్‌తో కలిపి ఉంచారు. కళ్లు తెరిచి చూసేసరికి నన్ను ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. మద్యం మత్తులో నాపై లైంగిక దాడి చేసిన తర్వాత జితేంద్ర హోటల్ నుంచి వెళ్లిపోయారు. ఆ రాత్రికి భయంభయంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని రెండు పేజీల ఫిర్యాదు లేఖలో ఆమె పేర్కొన్నారు.
పరువు పోతుంది.. వద్దన్నారు..!
నాకు అన్యాయం జరిగిన సమయంలో జితేంద్రకు బాగా పలుకుబడి ఉంది. నా తల్లిదండ్రులకు చెబితే.. వారు పరువు పోతుందంటూ ఫిర్యాదు చేయవద్దన్నారు. కానీ ప్రస్తుతం సమాజంలో ఎంతో మార్పు వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియా, మీటూ ఉద్యమం, మహిళా సంఘాల పోరాటాలు, హాలీవుడ్‌లో ఇటీవల చోటుచేసుకున్న లైంగిక వేధింపుల ఫిర్యాదులతో నాకు అవగాహనా వచ్చింది. పోరాడేందుకు నిర్ణయించుకున్నాకే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment