ముంబై: విధిగా నమాజ్ చేయడంలేదన్న కారణంగా ఓ బాలికను ఆమె కుటుంబీకులే హత్యచేశారు. ముంబైలోని అన్‌టాప్ హిల్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలంరేపింది. బాలికను చంపిన అత్త, మరో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్‌టాప్ హిల్ ఇన్‌స్పెక్టర్ సుదర్శన్ పథాంకర్ చెప్పిన వివరాలిలా ఉన్నాయి..
ఏలా జరిగింది?: తల్లి చనిపోవడంతో 15 ఏళ్ల బాలిక గత కొంతకాలంగా దగ్గరి బంధువుల ఇంట్లో ఉంటోంది. పని ఒత్తిడి కారణంగా పాపను చూసుకునే అవకాశం లేకపోవడంతో తండ్రి ఆ ఏర్పాటుచేశాడు. వరుసకు అత్తయ్యే మహిళ.. విధిగా నమాజ్ చేయాల్సిందిగా బాలికను వత్తిడిచేసేది. ప్రార్థన పట్ల ఆసక్తిలేని ఆ బాలిక అత్తమాట వినేదికాదు. ఇదే విషయంలో మొన్న శుక్రవారం వాగ్వాదం జరిగింది. పట్టరాని కోపానికిగురైన అత్త.. చున్నీని బాలిక మెడకు బిగించి చంపేసింది.
కప్పిపుచ్చేయత్నం: క్షణికావేశంలో చేసిన హత్యను కప్పిపుచ్చుకోవడానికి ఆ అత్త, ఆమె కుటుంబీకులు నానా తంటాలు పడ్డారు. బాత్‌రూమ్‌లో జారిపడిందంటూ బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లారు. పాప మెడపై కమిలిన గుర్తులను గమనించిన డాక్టర్లు.. మరుక్షణమే పోలీసులకు సమాచారం అందించారు. చివరికి ఇంటరాగేషన్‌లో నేరం చేసినట్లు అంగీకరించారు. బాలిక అత్తను, ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌చేశారు.
షాక్‌కు గురైన తండ్రి: బాలిక మరణవార్త విన్న తండ్రి షాక్‌కు గురయ్యాడు. ‘‘బాగా చూసుకుంటారన్న నమ్మకంతోనే నా బిడ్డను వాళ్లింట్లో ఉంచాను. ఆ దుర్మార్గులు ఇంత పని చేస్తారనుకోలేదు. అయినా, నమాజ్ చెయ్యకుంటే ఆ విషయం నాకు చెప్పాలిగానీ చంపడమేంటి?’ అని భోరున విలపించాడా తండ్రి.
Comments
Please login to add a commentAdd a comment