చికిత్స పొందుతున్న పంకజ్
ధారూరు : పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రం నుంచి వచ్చి మిషన్ భగీరథ ట్యాంకు పనుల్లో చేరాడు. 75అడుగుల పైనుంచి కిందపడి గాయాలపాలయ్యాడు. ఈ సంఘటన ధారూరు మండల కేంద్రంలోని ఈద్గా సమీపంలో నిర్మిస్తున్న మిషన్ భగీరథ ఓవర్‌హెడ్‌ట్యాంకు వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ధారూరులో 75అడుగుల ఎత్తులో మిషన్‌భగీరథ ఓవర్‌హెడ్‌ట్యాంకును నిర్మించారు. పనుల నిమిత్తం పైకి సర్వీస్ వైరు వేశారు. మంగళవారం రాత్రి 8గంటల వరకు విద్యుత్‌కు సంబంధించిన పనులు పూర్తయ్యాయి.
మహారాష్ట్ర అమ్రావతి జిల్లా బిస్‌కోలి గ్రామానికి చెందిన పంకజ్(19) ఇక్కడే పనిచేస్తున్నాడు. ట్యాంకు పైన వేసిన సర్వీస్ వైరును తీసివేయాలనీ కూలీల లీడర్ అనిల్ పంకజ్‌ను ఆదేశించాడు. పంకజ్ పైకి వెళ్లి విద్యుత్ సర్వీస్ వైర్ తీసేక్రమంలో అదుపుతప్పి పైనుంచి ఒక్కసారిగా జారాడు. భయకంపితుడై పంకజ్ నిటారుగా కూర్చున్న భంగిమలో కిందకు జారి కింద ఉన్న మొరంపై పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. ట్యాంకు పనులకు సపోర్టుగా ఇనుప రాడ్లు ఉన్నా వాటి మధ్య నుంచి రాడ్లకు తగలకుండా జారిపడ్డాడు.
వెంటనే తోటి కూలీలు యువకుడిని వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఇంతవరకు ట్యాంకు పనుల్లో పాల్గొన్న నలుగురు కూలీలు పైనుంచి అదుపుతప్పి కిందపడి ప్రాణాలు కోల్పోయారని, పంకజ్ మాత్రం గాయాలతో బయటపడటం నమ్మలేకపోతున్నామని తోటి కూలీలు పేర్కొన్నారు.
తమ కాట్రాక్టర్ అనురాగ్‌కు సమాచారం ఇవ్వగా ఆయనే వైద్యం చేయించేదుంకు ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఈ విషయమై పోలీసులను సంప్రదించగా ఇంతవరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, యువకుని తల్లిదండ్రులు వచ్చాక ఇవ్వవచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment